ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులకు సంబంధించి ఆక్రమణలపై 78 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి.. వారి సమక్షంలోనే గూగుల్ మ్యాప్స్‌ను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించి.. పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం, ఐలాపూర్ గ్రామం సర్వే నంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల్లో అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపించాలని గతంలో అక్కడ ఇంటి స్థలాలు కొన్నవారు ఫిర్యాదు చేశారు. అలాగే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, కుంట్లూర్ పెద్ద చెరువులో 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, 59జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు.
నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని మొదటి డివిజన్‌లో 2,900 గజాల పార్కును స్థానికులు కొందరు కబ్జా చేస్తున్నారని కేవీఆర్ రెయిన్‌బో కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని పెంచి తమ ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదంటూ వాసవి గ్రాడ్యుయేట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను ఆయా ఏరియా అధికారులకు కేటాయించి.. ప్రజల సమక్షంలోనే విచారణ జరపాలని, స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు తీసుకుని లోతైన విచారణ చేయాలని ఆదేశించారు.
రెండువారాల్లో అధికారులు వచ్చి విచారణ చేపడతారంటూ వారి ఫోన్ నంబర్లను ఫిర్యాదుదారులకు కమిషనర్ ఇవ్వడమే కాకుండా నాలుగువారాల్లో సమస్య పరిష్కారం కాకుంటే తానే స్వయంగా వచ్చి విచారణ చేపడుతానంటూ తెలిపారు. సమగ్రంగా విచారణ జరిపించి కబ్జాదారులపై కేసులు పెట్టాలని, కబ్జాల చెర నుంచి కాపాడిన ప్రభుత్వ భూముల వద్ద ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదులపై మ్యాపులను పరిశీలించాలని, ముందుగా అమీన్‌పూర్ చెరువు, దుర్గం చెరువు, మాసబ్ చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువులను పరిశీలించాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.