పర్యావరణ పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
నానాటికి పెరిగిపోతున్న కాలుష్యకారకాలను అదుపులో పెట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. జల, వాయు కాలుష్యం, జీవవైవిధ్యం, గ్లోబల్ వార్మింగ్, నదులు, సముద్రాలు, పర్వతాలు తదితర ప్రకృతి వనరుల విధ్వంసం, ప్లాస్టిక్ కాలుష్యం మొదలైన 12 అంశాలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాదుకు చెందిన పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను ఆమె మంగళవారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ప్రకృతి వనరుల్ని దుర్వినియోగం చేయకుండా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాలెండర్ రూపకల్పన చేసిన పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొండల్ రామ్, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు డా. కొమ్మూరి ప్రసాద్, గొడవర్తి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.