నల్లగొండ జిల్లాలోని గుడిపల్లి మండల కేంద్రం శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. స్థానిక కొండగట్టుపై, పంట పొలాల్లో క్రీ.పూ. 2000-1000 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన సమాధి గదులు, పలు పురావస్తు విశేషాలు వెలుగుచూశాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఊరి వెలుపల ఉన్న అనేక నిలువురాళ్లు (మరణించిన వారికి గుర్తుగా నిలిపే స్మారక శిలలు), గుడిపల్లి-శింగరాజుపల్లి రోడ్డు వెంబడి ఉన్న గూడు సమాధులు కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్లమ్మ బండపై ఉన్న గూడు సమాధి నిర్మాణపరంగా అరుదైనదని, రెండు రాతి వరుసలపై దీర్ఘ చతురస్రాకారంలో ఒక పెద్దగుండు రాతిని అమర్చారని వివరించారు. నల్లగొండ జిల్లా చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన ఈ ఆనవాళ్లను కాపాడుకొని, చరిత్ర చిహ్నాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. గూడు సమాధిపై గుండురాతిని అమర్చడం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుందని, వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, కో కన్వీనర్ డాక్టర్ భద్రగిరీష్ అభిప్రాయపడ్డారు.
