మల్క కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన..

 తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టికరిపించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పనిచేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానన్నారు.

కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గపు ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. కొమరయ్య విజయం రెండు రోజుల క్రితమే ఖరారుకాగా, పట్టభద్రుల ఫలితం బుధవారం వెలువడింది. కాగా, గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్లతో అంజిరెడ్డి గెలుపొందారు. రెండు రోజుల పాటు జరిగిన కౌంటింగ్‌ ప్రక్రియ అడుగడుగునా ఉత్కంఠ రేపింది. బీజేపీ-కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ‘నువ్వానేనా’ అన్నట్టుగా గెలుపు దోబూచులాడింది. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పట్టభద్రుల స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 28,686 ఓట్లు చెల్లలేదు.

వీటిలో 75,675 బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి, 70,565 కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి, 60,419 ఓట్లు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. నిబంధనల ప్రకారం మొదటి ప్రాధాన్యతలోనే 1,11,672 ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలి. కానీ మొదటి ప్రాధాన్యంలో ఏ అభ్యర్థికి కూడా అన్ని ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. మొత్తం 56 మంది పోటీచేయగా, రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించేందుకు గాను 54 మందిని ఎలిమినేట్‌ చేస్తూ వచ్చారు. చివరకు బీజేపీ అభ్యర్థికే అత్యధిక ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాకపోయినా 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం ఉండడంతో మూడో ప్రాధాన్యానికి వెళ్లకుండా అంజిరెడ్డి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.