- తండ్రి మధ్యవర్తిత్వంలో అవినీతి వ్యవహారాలు
- ఓ భూ వ్యవహారంలో 17 కోట్లు డిమాండ్
- ముఖ్యనేతకు తెలిసి మందలించినట్టు సమాచారం
తెలంగాణ రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్ వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కలెక్టర్ తండ్రిచాటు బిడ్డనంటూ బయటకు బిల్డప్‌లు ఇస్తూ.. లోపల మాత్రం తండ్రితోనే అవినీతి వ్యవహారాలు నడుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ కలెక్టర్ ఎక్కడికి వెళ్తే తండ్రి కూడా అక్కడకు మకాం మారుస్తారని వినికిడి. ఇటీవల నగరానికి సమీపాన 34 ఎకరాల భూమికి సంబంధించి వివాదం తలెత్తింది. దీంట్లో కలెక్టర్ పాత్ర కీలకంగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు కలెక్టర్ ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆ భూమిపై హక్కున్న వ్యాపారవేత్త తొలుత లబోదిబోమన్నప్పటికీ ఆ తరువాత కలెక్టర్ తండ్రితో బేరం కుదుర్చుకున్నాడు. రూ.17 కోట్లకు ఒప్పందం కుదిరినప్పటికీ, ఆ భూమిలో ఎంతో కొంత ఇవ్వాలని కలెక్టర్ తండ్రి షరతు పెట్టినట్టు తెలిసింది.
ఈ షరతులను చూసి భయపడిన సదరు వ్యాపారి ప్రభుత్వంలోని అత్యంత కీలక నేతకు సన్నిహితుడైన వ్యక్తిని ఆశ్రయించాడు. ఆ సన్నిహితుడు కూడా భూ లావాదేవీల్లో ఆరితేరాడు. ఆయన కూడా కలెక్టర్ వ్యవహారం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక చేసేదేమీలేదనుకొని ఏకంగా ప్రభుత్వంలోని కీలక నేతకే విషయం చెప్పాడు. ఆయన ఆ రాత్రే కలెక్టర్‌కు ఫోన్ చేశారు. “ఇదేంది.. మీలాంటి వారితో పరువు పోతున్నది’ అంటూ కలెక్టర్‌పై మండిపడ్డట్టు తెలిసింది. ‘మీ నాయనతో డబ్బాపెట్టించి వసూళ్లు చేస్తున్నావు. ఏసీబీతో రైడ్ చేయిస్తా..’ అని హెచ్చరించినట్టు సమాచారం. తెల్లారి కీలక మంత్రి కూడా అదే కలెక్టర్‌కు ఫోన్‌చేసి అసలు సంగతేమిటని ఆరాతీసినట్టు తెలిసింది. ఈ కలెక్టర్ గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేసినప్పుడే ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. తాజాగా ఆ కలెక్టర్‌ను బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. (సోర్స్: నమస్తే తెలంగాణ)