ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు సమర్ధ సేవలు : నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్

ఆధునీకరించిన నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
వృత్తి నిబద్ధత ద్వారా ప్రజా మన్ననలు పొందాలని సిబ్బందికి సూచన
ప్రభుత్వం కల్పించే ఆధునిక వసతులతో ప్రజలకు సమర్ధ సేవలు
పోలీస్ స్టేషన్లలో కల్పిస్తున్న ఆధునిక వసతులతో ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ పోలీస్ సిబ్బందికి సూచించారు.
సోమవారం జిల్లా కేంద్రంలో ఆధునికరించబడిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా సిఐ కార్యాలయాన్ని అదనపు ఎస్పీ నర్మద ప్రారంభించారు. ఆనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో కొన్ని పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ జరుగుతున్నదని, ఇందులో భాగంగా 16.50 లక్షల రూపాయల వ్యయంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. సిఐ నిగిడాల సురేష్, సిబ్బంది పని తీరును అభినందించారు. స్టేషన్ లోని ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని చేస్తూ బాధితుల పక్షాన నిలిచి న్యాయం అందించడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ గౌరవం పెరిగే విధంగా పని చేయాలని చెప్పారు. పోలీస్ శాఖ ద్వారా కల్పించబడుతున్న ఆధునిక వసతులు, సౌకర్యాలు ప్రజల కోసమేనన్న విషయాన్ని గుర్తుంచుకొని పని చేయాలన్నారు. ఆధునికత పోలీస్ స్టేషన్ భవనంలోనే కాకుండా సిబ్బంది పనితీరులోనూ రావాలని అప్పుడే ప్రజలలో మంచి గుర్తింపు సాధ్యమవుతుందని చెప్పారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా పలకరించి ఓపికతో వారి సమస్య తెలుసుకొని వారికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా ప్రజలతో మమేకం కావాలన్నారు.
ప్రజలకు సమర్ధవంతంగా సేలందించడంతో పాటుగా పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనివిధానంలోనూ ఆధునికత కనిపించాలని, ఉన్నతాధికారులు సూచించిన విధంగా 5 ఎస్ విధానం ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును ఎస్పీ రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఎస్పీకి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజ కార్యక్రమాల అనంతరం ఆశీస్సులు అందించారు. అంతకు ముందు పోలీస్ స్టేషన్ అవరణలో ఎస్పీ రంగనాధ్ మొక్కలు నాటారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, సబ్ డివిజన్ సిఐలు పి.ఎన్.డి. ప్రసాద్, మహబూబ్ బాషా, బాలగోపాల్, సురేష్ కుమార్, రాజశేఖర్ గౌడ్, సురేష్ బాబు, ఎస్.ఐ.లు నరేష్, కొండల్ రెడ్డి, నర్సింహులు, ఏ.ఏస్.ఐ. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, వన్ టౌన్ సిబ్బంది శ్రీను, రాజు, షకీల్, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.