గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌

గ్రూప్‌-1 పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పత్రాలను మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ..

గ్రూప్‌-1 పరీక్ష పత్రాలను మూల్యాంకం చేసినవారిలో చాలామందికి తెలుగు, ఉర్దూ తెలియదని, దీంతో ఆ భాషల్లో పరీక్షలు రాసినవారికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. పిటిషనర్‌ ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 21కి వాయిదా వేశారు.