టారిఫ్‌లతో ఫార్మా కుదేలు : బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి

భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన టారిఫ్‌లు ఎప్పుడైనా అమల్లోకి రావచ్చని, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. 30 లక్షలకుపైగా భారతీయుల ఉద్యోగ భద్రతకు దీనివల్ల ముప్పు వాటిల్లుతుందన్న ఆవేదనను వెలిబుచ్చారు. రాజ్యసభలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘గత ఏడాది అమెరికాకు భారత్‌ నుంచి సుమారు 9 బిలియన్‌ డాలర్ల విలువైన (రూ.74,000 కోట్లు) ఔషధ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. మున్ముందు ఈ ఎగుమతులు మరింతగా పెరుగుతాయి.

ఇలాంటి సమయంలో పన్నుల పెంపు ఆందోళన కలిగించే అంశమే’ అని పేర్కొన్నారు. భారత ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 31 శాతంగా ఉన్నదని చెప్పారు. సుంకాలతో భారత ఔషధాలు అమెరికా మారెట్‌లో మరింత ఖరీదవుతాయని, ఎగుమతులు పడిపోవచ్చని వివరించారు. ప్రత్యేకించి జనరిక్‌ మెడిసిన్స్‌ లాభదాయకత పోవచ్చని తెలిపారు. అమెరికా టారిఫ్‌ ప్రతిపాదనల వల్ల భారత్‌కు విదేశీ మారకద్రవ్య ఆదాయం తగ్గిపోవచ్చని.. తయారీ, పరిశోధన, పంపిణీలో లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నదని హెచ్చరించారు. కాబట్టి దీన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని పరిష్కార మార్గాలను కూడా ఆయన కేంద్రానికి సూచించారు.