నెల రోజులు పోలీస్‌ యాక్ట్‌-30 అమలు : సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు 30, 30 (ఏ) పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్‌ హెచ్చరించారు.

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు 30, 30(ఎ) పోలీస్‌ చట్టం 1861 ప్రకారం ఏప్రిల్‌1వ తేది నుంచి 30వరకు అమలులో ఉంటుందని సూచించారు. జిల్లా పరిధిలో ముందస్తు పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, మైకు పెట్టుకుని తిరగడం, సభలు, సమావేశాలు, నిరాహార దీక్షలు నిర్వహించరాదన్నారు.

ప్రజా ధనానికి నష్టం కలిగించే, చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపట్టరాదని ఎస్పీ స్పష్టంచేశారు. జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు నిర్వహించే నిఘా, బందోబస్తుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. ఒకవేళ పోలీసుల అనుమతి లేకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.