కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్‌

పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా పార్టీ తరఫున ఓ మాట ఇస్తున్నాం. మూడేళ్లలో ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చాక ఆ 400 ఎకరాలను హైదరాబాద్‌, తెలంగాణలోనే అతిపెద్ద ఎకో పార్క్‌గా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే మేం స్పష్టం చేస్తున్నాం. ఎవరైనా రేవంత్‌రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి.. రేవంత్‌రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్‌లో ఒక ఇంచు కొనుగోలు చేసినా తిరిగి వెనక్కి తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.

‘అద్భుతమైన ఎకో పార్క్‌ని హైదరాబాద్‌ ప్రజలకు కానుకగా అందిస్తాం. సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులకు, హైదరాబాద్‌ ప్రజలకు గిఫ్ట్‌గా ఇస్తాం. హైదరాబాద్‌ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. కాంగ్రెస్‌కు ఒక్క సీట్‌ ఇవ్వకుండా గెలిపించారు. 400 ఎకరాలను పొరపాటున ఎవరూ కొనవద్దు. కొంటే నష్టపోతారు. తర్వాత తప్పు పట్టొద్దు. ప్రభుత్వంలోకి వచ్చాక కాదు.. మూడేళ్ల ముందుగానే చెబుతున్నాం. ఈ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ కాంక్షతో పని చేస్తుంది. మేం మాత్రం భవిష్యత్‌ తరాల కోసం ఆలోచిస్తున్నాం. వచ్చే తరాల కోసం ఆలోచించాలని మా నేత కేసీఆర్‌ చెప్పారు. మొన్నటి వరకు ఆ జాగ కోర్టులో ఉంది. ప్రైవేటు వ్యక్తులది కాదు.. ప్రభుత్వానిది కాదని కొట్లాడం. దాంతోనే ఆ ల్యాండ్‌ ప్రజలకు వచ్చింది. మేం కొట్లాడింది రియల్‌ ఎస్టేట్‌ కోసం కాదు కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి.. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు.. గాలి కాలుష్యంతో మాస్క్‌లు వేసుకొని తిరిగి పరిస్థితి ఢిల్లీలో ఉన్నది. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దని.. భవిష్యత్‌ తరాలు బాగుండాలంటే.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను ఎకో పార్క్‌గా మారుస్తాం’ అని స్పష్టం చేశారు.