కంచ గ‌చ్చిబౌలిలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు నిలిపివేయాలి.. ఇది చాలా తీవ్ర‌మైన అంశం : సుప్రీంకోర్టు

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో హైకోర్టు రిజిస్ట్రార్ మ‌ధ్యంత‌ర నివేదిక‌ను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ చ‌ర్య‌లు అన్నీ నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ప్ర‌తివాదిగా కోర్టు చేర్చింది. అత్య‌వ‌స‌రంగా కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏంట‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. చ‌ట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటార‌ని జ‌స్టిస్ గ‌వాయ్ ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌శ్న‌ల‌కు సీఎస్ స‌మాధానం చెప్పాల‌ని కోర్టు ఆదేశించింది. ఇది చాలా తీవ్ర‌మైన అంశం అని జ‌స్టిస్ గ‌వాయ్ ధర్మాస‌నం పేర్కొంది. అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 16న త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్ట‌నుంది సుప్రీంకోర్టు.

సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉన్న 400 ఎకరాల్లోని చెట్లను నరికి వేస్తున్నారని.. అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని కోరారు. అయితే, పిటిషన్‌పై మధ్యాహ్నం 3.45కు విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు ప్రభుత్వం పనులు చేపడుతున్న స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు చెట్లను నరికివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలుపగా.. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్‌ బీర్‌ గవాయ్‌ స్పష్టం చేశారు.