సుప్రీంకోర్టు తీర్పుపై హెచ్‌సీయూలో విద్యార్థుల సంబురాలు..

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ చ‌ర్య‌లు అన్నీ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా హెచ్‌సీయూలో విద్యార్థులు సంబురాలు నిర్వ‌హించారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా రేవంత్ రెడ్డి దుందుడుకు చ‌ర్య‌లు విర‌మించుకోవాల‌ని విద్యార్థులు సూచించారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం కొన‌సాగిస్తామ‌ని తేల్చిచెప్పారు.

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. భూముల్లో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌న్నీ త‌క్ష‌ణం ఆపేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మ‌ధ్యంత‌ర నివేదిక‌ను సుప్రీంకోర్టు ప‌రిశీలించింది. వార్తా క‌థ‌నాల‌ను జ‌స్టిస్ గ‌వాయ్ ముందు అమిక‌స్ క్యూరీ మెన్ష‌న్ చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ప్ర‌తివాదిగా చేర్చింది కోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఫొటోలు చూస్తే ప‌రిస్థితి అర్థ‌మ‌వుతుంద‌న్నారు. వంద‌ల యంత్రాలు మోహ‌రించాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని జ‌స్టిస్ గ‌వాయ్ ప్ర‌శ్నించారు. అత్య‌వ‌స‌రంగా కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇది చాలా తీవ్ర‌మైన అంశం అని కోర్టు పేర్కొంది. 3 రోజుల్లో 100 ఎక‌రాల్లో చెట్లు కొట్టివేత చిన్న విష‌యం కాదని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. చెట్ల కొట్టివేత‌కు అనుమ‌తి తీసుకున్నారా..? అని కోర్టు ప్ర‌శ్నించింది. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ఒక్క చెట్టు కూడా న‌రికివేయొద్ద‌ని కోర్టు ఆదేశించింది. అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సీఎస్‌ను కోర్టు ఆదేశించింది. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టొద్ద‌ని కోర్టు ఆదేశించింది. ప్ర‌భుత్వం మార్చి 15న వేసిన క‌మిటీ అధికారులూ జ‌వాబు ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. ఉల్లంఘ‌న‌లు జ‌రిగితే సీఎస్ వ్య‌క్తిగ‌త బాధ్య‌త వ‌హించాల‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది.