సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్లుగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఐదుగురిని నియమించింది. నమస్తే తెలంగాణ పత్రికా సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, టీ న్యూస్ సీఈవో మైడ నారాయణరెడ్డి, విద్యార్థి నాయకుడు గుగులోత్ శంకర్‌నాయక్, సోషల్ వర్కర్లు సయ్యద్ ఖలీలుల్లా, డాక్టర్ మహ్మద్ అమీర్ హుస్సేన్‌ను ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రతిపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సభ్యులుగా ఏర్పాటైన సెర్చ్‌కమిటీ వీరిని ఎంపికచేసింది. అనంతరం సమాచారహక్కు కమిషనర్ల నియామకానికి ఐదుగురి పేర్లను ఆమోదిస్తూ గవర్నర్‌కు కమిటీ సిఫారసు చేసింది. వీరి పేర్లను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సోమవారం సంబంధిత ఫైల్‌పై సంతకంచేశారు. రాజ్‌భవన్ నుంచి ఫైల్ రాగానే రాష్ట్రప్రభుత్వం ఐదుగురి నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. వీరు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేండ్లపాటు పదవిలో కొనసాగుతారని జీవోలో స్పష్టంచేశారు.