ఏసీబీ వలలో అవినీతి చేప

జమ్మికుంట సెర్ప్‌లో రూ.10 వేలు తీసుకుంటుండగా సీసీ పట్టివేత

గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా వచ్చే గౌరవ వేతనం రిలీజ్‌ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసి, మంగళవారం అడ్డంగా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితురాలు వీవోఏ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లిలో శ్రీరాజరాజేశ్వర గ్రామైక్య సంఘానికి సహాయకురాలిగా దొడ్డె స్వప్న పనిచేస్తున్నది. ఆమెకు ప్రాజెక్టు నుంచి నెలకు రూ.5వేల గౌరవ వేతనం గ్రామైక్య సంఘం ఖాతాలో పడుతున్నది. ఆ డబ్బు తీసుకోవాలంటే సంఘం లీడర్లతో పాటూ సెర్ప్‌ సీసీ అనుమతి తప్పనిసరి. దీనిని సీసీ సురేశ్‌ ఆసరాగా చేసుకుని.. లంచం ఇస్తేనే గౌరవ వేతనం రిలీజ్‌ చేయిస్తానని ఐదు నెలలుగా అడ్డుకుంటున్నాడు. స్వప్న మంగళవారం సెర్ప్‌ కార్యాలయానికి వచ్చి రూ.10వేలను సీసీ సురేశ్‌కు ఇచ్చారు. వెంటనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.