హరిత హననంపై కేంద్ర సాధికార కమిటీ పరిశీలన

అరుదైన జీవవైవిధ్యానికి నిలయమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల్లో జరిగిన విధ్వంసంపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం మొదలుపెట్టింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల అటవీభూముల్లో చెట్లను నరికిన ప్రాంతానికి కమిటీ చైర్మన్‌ సిద్ధాంత్‌ దాస్‌ నేతృత్వంలో సభ్యులు చంద్రప్రకాశ్‌ గోయల్‌, సునీల్‌ లిమయే, చంద్రదత్‌, పర్యావరణ, అటవీశాఖ నిపుణులు, రాష్ట్ర స్థాయి అధికారులు, సైబరాబాద్‌ సీపీ మహంతితో కలిసి ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. కమిటీ సభ్యులను అధికారులు, పోలీసులు వర్సిటీ ఈస్ట్‌ క్యాంపస్‌ వెనుక గేట్‌ నుంచి లోపలికి తీసుకొచ్చారు.

ఐదు రోజుల పాటు కాంగ్రెస్‌ సర్కారు చెట్లను నరికి, చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. చెట్లు నరికిన ప్రాంతాన్ని అధికారులకు చూపించేందుకు తమను అనుమతించాలని విద్యార్థులు కోరినా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే నెపంతో పోలీసులు అనుమతించలేదు. ఈస్ట్‌ క్యాంపస్‌ ప్రాంతంలో సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ సభ్యులు గంట పాటు కలియదిరిగారు. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బంది, పర్యావరణ, అటవీ శాఖ అధికారులతో కలిసి యూనివర్సిటీ పరిధిలో ఉన్న మొత్తం భూముల విస్తీర్ణం, జీవవైవిధ్యం, పర్యావరణ పరిస్థితులు, వన్యప్రాణులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థి జేఏసీ నేతలు అక్కడ కలుస్తామని చెప్పగా వద్దన్నారు. జేఏసీతో నేతలతో మాట్లాడేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్డీ)లో మాట్లాడుతామని చెప్పారు.

హెచ్‌సీయూ జేఏసీ నుంచి ఐదుగురు విద్యార్థులు, ఏబీవీపీ నుంచి మరో ఐదుగురు విద్యార్థులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. 400 ఎకరాల్లో కాంగ్రెస్‌ సర్కారు చేసిన విధ్వంసంపై గంట పాటు విద్యార్థుల నుంచి ఆరా తీశారు. వర్సిటీలో చెట్ల నరికివేత, జీవ వైవిధ్యం, పర్యావరణం వంటి అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలను, మౌఖిక, లిఖితపూర్వకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి జేఏసీ బృందం కమిటీ ముందుకు పలు కీలక అంశాలను తీసుకొచ్చినట్టు తెలిసింది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడంతో పాటు చెట్లు నరికిన ప్రాంతంలో ఉన్న జీవజాలం గురించి అన్ని వివరాలతో నివేదిక రూపంలో అందించారు. అక్కడి చెట్లు, జంతువులు, అరుదైన జీవజాతుల ప్రాముఖ్యతపై వివరించినట్టు విద్యార్థులు తెలిపారు. తమ విన్నపాలను మెయిల్‌ రూపంలో అధికారికంగా అంజేయాలని కమిటీ సభ్యులు చెప్పినట్టు వివరించారు. తమతో కలిసి మరోసారి 400 ఎకరాల ప్రాంతంలో తిరిగేందుకు అవకాశం కల్పించేందుకు సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ప్రభుత్వం విధ్వంసం సృష్టించిన ప్రాంతంలో ఉన్న పీకాక్‌ లేక్‌, బఫెల్లో లేక్‌, మష్రూమ్‌ రాక్స్‌, జంతువులు, పక్షులను చూసేందుకు మళ్లీ పర్యటించాలని కోరినట్టు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ బృందంతో సమావేశం అనంతరం హెచ్‌సీయూ పాలక మండలితో సాధికార కమిటీ సమావేశమైంది. వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు పలువురు హెచ్‌వోడీలు సమావేశంలో పాల్గొని వర్సిటీ తరఫున పలు సాక్ష్యాలను, కాగితాలను అందజేశారు. అక్కడ జీవజాలం ఉన్నదని, చెట్లు ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. అనంతరం బీజేపీ ప్రతినిధుల బృందం కమిటీని కలిసింది. ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు మాట్లాడుతూ 150 ఎకరాల్లో రాత్రికిరాత్రే చెట్లను నరికివేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులతో భేటీ అయి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మోహంతి, కలెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలో సాధికార కమిటీ కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. జీవవైవిధ్యంపై కాంగ్రెస్‌ సర్కారు చేసిన దౌర్జన్యం, జీవావరణాన్ని దెబ్బతీసేలా వృక్ష సంపద, వన్యప్రాణులపై జరిగిన విధ్వంసం, విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, బనాయించిన అక్రమ కేసులు వంటి విషయాలన్నీ సేకరించినట్టు సమాచారం. తొలి రోజు విద్యార్థులతో భేటీ కాగా నేడు పర్యావరణ, అటవీ శాఖ నిపుణులతో సమావేశమయ్యే అవకాశమున్నదని తెలిసింది. పలు దఫాల సమావేశాల తర్వాత నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తామని కమిటీ సభ్యులు వివరించారు. గురువారం జరిపింది ప్రాథమిక విచారణ మాత్రమేనని, ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని, త్వరలోనే మరోసారి హెచ్‌సీయూలో తమ పర్యటన ఉంటుందని కమిటీ స్పష్టం చేసినట్టు సమాచారం.

విద్యార్థులతో భేటీ అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కమిటీ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాకు చేరుకున్నది. అక్కడ కొద్దిసేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సభ్యులు మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందంతో సుమారు అరగంటకుపైగా కమిటీ భేటీ అయింది. హెచ్‌సీయూ భూములకు సంబంధించి, జరిగిన విధ్వంసం గురించి 200 పేజీల కీలక డాక్యుమెంట్లు, ఫొటోలను బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు కమిటీకి అందించారు. అవి హెచ్‌సీయూ భూములేనని, అటవీ చట్టాల ప్రకారం అక్కడ చెట్లు నరకడం నేరమని, గతంలో ఈ తరహా వివాదాల్లో సుప్రీంకోర్టుతో పాటు పలు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కాపీలను కూడా అందజేశారు.

కాంగ్రెస్‌ సర్కారు చెట్లు నరికిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులకు తామే స్వయంగా చూపించేందుకు అనుమతివ్వాలని విద్యార్థులు కోరారు. తమకు కాంగ్రెస్‌ సర్కారు, పోలీసులపై నమ్మకం లేదని.. కమిటీ సభ్యులకు విధ్వంసం జరిగిన ప్రాంతం మొత్తాన్ని చూపించరని అనుమానం వ్యక్తంచేశారు. తమతో కలిసి మరోసారి యూనివర్సిటీలో కమిటీ పర్యటించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కాగా క్యాంపస్‌లో గంటకుపైగా గడిపిన కమిటీ సభ్యులు అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 12 గంటలకు ఎంసీహెచ్‌ఆర్డీకి చేరుకున్నారు. అక్కడ విద్యార్థులు, విద్యార్థి జేఏసీ ప్రతినిధులతో మాట్లాడారు.