తెలంగాణ పీసీబీ అప్పిలేట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ సాంబశివరావు నాయుడు!

  • ఓ సభ్యుడి నియామకంపై వివాదంతో నిలిచిపోయిన ఉత్తర్వులు..

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సాంబశివరావు నాయుడు పేరు ఖరారైంది. అయితే పీసీబీ అప్పిలేట్ అథారిటీలో మరో ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉండగా.. ఓ సభ్యుడి విషయంలో వివాదం తలెత్తింది. దాదాపు నెల రోజులుగా ఈ ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీంతో పీసీబీ అప్పిలేట్ అథారిటీ నియామక ఉత్తర్వులు నిలిచిపోయాయి. పరిశ్రమలు నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో వాటిపై చర్యలు తీసుకునే అధికారం పీసీబీకి ఉంటుంది. ఉల్లంఘనల స్థాయి, తీవ్రత ఆధారంగా సూచనలు, షరతులు, పరిశ్రమ మూసివేత వంటి చర్యలు తీసుకుంటుంది. పీసీబీ నిర్ణయాలు, ఆదేశాలపై ఏమైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించవచ్చు. అందులో చైర్మన్ గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి, మరో ఇద్దరు సభ్యులు ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన అప్పిలేట్అ ధారిటీ గడువు పూర్తయిపోయింది. దీంతో కొత్తవారి నియామక ప్రక్రియ ఐదు నెలల క్రితం ప్రారంభమైంది. జస్టిస్ సాంబశివరావు నాయుడు చైర్మన్ గా, మరో ఇద్దరు సభ్యులుగా నియామకంపై ప్రభుత్వం వద్దకు ఫైల్ వెళ్లింది. ఇందులో ఓ సభ్యుడు గాదె దయాకర్ కాగా, మరో సభ్యుడి పేరు విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ఈ అంశం వివాదంగా మారడంతో ఇద్దరు సభ్యుల నియామకానికి తాజాగా ప్రకటన జారీ చేయాలని.. వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైల్ పై రాసినట్లు సమాచారం. ఇద్దరు సభ్యుల్లో ఒకరి విషయంలోనే వివాదం ఉండటంతో జస్టిస్ సాంబశివరావు నాయుడు చైర్మన్ గా, గాదె దయాకర్ సభ్యుడిగా అప్పిలేట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరో సభ్యుడిని తర్వాత నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఫైల్ న్యాయశాఖకు చేరగా చైర్మన్, ఒక సభ్యుడితో కలిపి ఇద్దరు అవుతారని.. ఒకరు లేదా ముగ్గురితో అథారిటీ ఉండాలని పీసీబీలోని ఉన్నతాధికారులు కొందరు సూచించినట్లు తెలిసింది.