వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఖిల్లాఘణపూర్ మం డలం టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కొండయ్య బుధవారం వనపర్తి డీఈ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఖిల్లాఘణపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నిర్మించిన తిరుమల ఆగ్రో ఇండస్ర్టీస్‌కు 160 కేవీ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఏఈ కొండయ్య లంచం డిమాండ్ చేశాడు. ఇదే పని కోసం గతంలో కూడా రూ. 30 వేలు తీసుకున్నాడు. ప్రస్తుతం రూ. 20 వేలు డిమాండ్ చేయగా, రూ. 10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏఈ కొండయ్య డబ్బు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయనను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఏసీబీ అధికారులు సూచించారు.
