ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా..!

  • అక్రమ ఆస్తులపై వరుస ఫిర్యాదులు
  • రంగంలోకి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ
  • బ్యూరోక్రాట్లు, వారి బంధువుల ఆస్తులపై నజర్
  • భూములు, ఫామ్ హౌస్ ల వివరాలు సేకరణ
  • రియల్ ఎస్టేట్, కన్స్ స్ట్రక్షన్ బిజినెస్ లో వాటాలపైనా..
  • సీనియర్లకు పోటీగా జూనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లు

ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారు సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత ఉన్నదనే వివరాలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వారితో పాటు బంధువుల పేర్ల మీద కూడబెట్టిన ఆస్తుల చిట్టాను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా వారు భారీ మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక వనరులు ఎక్కడ నుంచి వచ్చాయనే కోణంలో ఫీల్డ్ లెవల్ లో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. కొంత మంది బ్యూరోక్రాట్స్ హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు, ఫామ్ హౌజ్ లు కొనుగోలు చేశారని, కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఇంటెలిజెన్స్ బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది..

ఐఏఎస్, ఐపీఎస్ లపై వరుస ఫిర్యాదులతో రంగంలోకి..
గత ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ల వద్ద పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు ఉన్నట్లు కొందరు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు. చేశారని తెలిసింది. ఆ జాబితాలో విపక్షాలకు చెందిన కొందరు సీనియర్ నేతలు సైతం ఉన్నట్లు తెలిసింది. తమ ఫిర్యాదుతో పాటు ఆధారాలను సైతం పంపినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఔటర్ చుట్టూరా ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్ లకు ఆస్తులు ఉన్నట్లు వీడియో, ఇమేజ్ డాక్యుమెంట్స్ ను జత చేసినట్టు తెలిసింది. దీంతో ఎక్కడెక్కడ ఏ ఆఫీసరు ఎన్ని ఆస్తులు ఉన్నాయి..? ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం వాటి విలువ ఎంత..? వారి పేరుతోనే ఉన్నాయా..? లేక బంధువుల పేర్ల మీద ఉన్నాయా..? అనే కోణంలోనూ క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించినట్లు తెలిసింది. అలాగే చాలా మంది ఐఏఎస్ లకు గ్రేటర్ చుట్టూరా వ్యాపారాలు చేస్తున్న బడా రియల్ ఎస్టేట్, కన్స్ స్ట్రక్షన్ కంపెనీల్లో బినామీల పేరుతో వాటాలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. మరోవైపు రాష్ట్రంలో పని చేస్తోన్న మెజార్టీ ఐఏఎస్ లకు ఖరీదైన విల్లాలు, ప్లాట్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న చాలా విలువైన భూములు బ్యూరోక్రాట్స్ కు చెందినవే అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. అందులో మెజార్టీ వాటా నార్త్ ఇండియన్ ఆఫీసర్లవే అనే ప్రచారం ఉంది. ఎందుకంటే గత, ప్రస్తుత ప్రభుత్వంలో సదరు ఆఫీసర్లు పలు కీలక శాఖల్లో పని చేశారు. ఆ టైంలోనే పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్కారు వద్ద రాయితీలు పొందిన రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు, బిల్డర్ల సహకారంతోనే అంతటి విలువైన ఆస్తులను వారు దక్కించుకున్నట్లు అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో ఓపెన్ గా టాక్ నడుస్తోంది.

డీవోపీటీకి ఇచ్చే ఆస్తుల వివరాలు అసంపూర్ణం
క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలోనే ఆల్ ఇండియా సర్వీసులోని ప్రతి అధికారీ తమ స్థిర ఆస్తుల వివరాలను హోంశాఖ పరిధిలోని డీఓపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కు సమర్పించాలి. భూములు, ఇండ్లు, ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేస్తే వాటి వివరాలను పేర్కొనాలి. తమ పేరు మీద కొనుగోలు చేసినా, ఫ్యామిలీ మెంబర్ల పేరు మీద కొనుగోలు చేసినా.. తప్పకుండా కేంద్రానికి తెలియజేయాలి. కానీ రాష్ట్రంలోని చాలా మంది ఐఏఎస్ లు తాము కొనుగోలు చేసిన అన్ని స్థిర ఆస్తుల వివరాలను డీవోపీటీకి చెప్పకుండా, ఒకటి అర చెప్పి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో పనిచేస్తోన్న కొందరు ఐఏఎస్ లు 20 ఏళ్ల కిందట తమ పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలనే కేంద్రానికి పంపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. చాలా మంది ఆఫీసర్లు తమ పేరు మీద, ఫ్యామిలీ మెంబర్ల పేరు మీద ఎలాంటి స్థిర ఆస్తులను కొనుగోలు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. తమకు సన్నిహిత బంధువులు, స్నేహితుల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని సమాచారం.

సీనియర్లకు పోటీగా జూనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లు
ఒకప్పుడు కొత్తగా సర్వీసులోకి వచ్చే ఐఏఎస్, ఐపీఎస్ లు అక్రమాలకు దూరంగా ఉంటారనే ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉందని విమర్శలు ఉన్నాయి. ట్రైనింగ్ పూర్తయి, ప్రొబేషనరీ టైమ్ నుంచే ఆస్తులు సంపాదించాలనే లక్ష్యంగా యంగ్ బ్యూరోక్రాట్స్ ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. అందుకు కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ఇన్సిడెంట్ ను ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రొబేషనరీ టైమ్ లో ఉండగానే ఓ లేడీ ఐపీఎస్ గ్రేటర్ పరిధిలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వివాదంలో ఇరుక్కున్నారు. గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని డీవోపీటీకి ఫిర్యాదు చేయగా సదరు అధికారిణి ప్రొబేషనరీ టైమ్ ను పొడిగించారు. అలాగే కొందరు యంగ్ ఐఏఎస్ లు సైతం తాము పనిచేస్తోన్న జిల్లా పరిధిలో కొత్తగా వెంచర్లపై ఫోకస్ పెట్టి వాటాలు అడుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

  • 30 ఏళ్ల సీనియార్టీ ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బందువులకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గర 150 ఎకరాల విలువైన భూమి ఉంది. పక్కనే ఉన్న సర్కారు భూమిని కూడా కొంత కబ్జా చేసి ఈ మధ్య అక్కడ వెంచర్ డెవలప్ మెంట్ పనులు ప్రారంభించారు. ఈ బిజినెస్ లో ఓ బీఆర్ఎస్ ఎంపీ వాటా కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు వచ్చే మార్గంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ కు పదుల ఎకరాల్లో భూములు ఉన్నట్లు టాక్.
  • నార్త్ ఇండియాకు చెందిన మరో సీనియర్ ఐఏఎస్ కు ఔటర్ చుట్టూ వందల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్, ఖరీదైన విల్లాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది.
  • ఓ సీనియర్ ఐఏఎస్ తన కొత్త భార్య పేరు మీద పెద్ద ఎత్తున విల్లాలు కొనుగోలు చేసినట్లు విమర్శలొస్తున్నాయి.
  • దక్షిణ తెలంగాణకు చెందిన ఓ కన్ఫర్డ్ ఐఏఎస్ కు అతనికే గుర్తు లేనన్ని ఖరీదైన ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లు ప్రచారం.
  • కొందరు ఐపీఎస్ లు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టకుండా 5 శాతం వడ్డీ రూపేణా రూ.10 కోట్లు వడ్డీ వ్యాపారులకు ఇచ్చి బిజినెస్ చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. (సోర్స్: దిశ)