హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకుఆ సంస్థ ప్రతినిధి బి.రమేష్ విరాళం డీడీని అందజేశారు.
మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాల వివరాలను అధికారులు వెల్లడించారు. మే 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం , సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహణ ఉంటుందని తెలిపారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ జరుగనుందని అన్నారు.
మే 2న ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ, 3న ఆలయంలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పుష్పయాగం, 12న పౌర్ణమి నాడు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, 18న అన్నమాచార్య కళామందిరంలో ఆస్థానం, 22న హనుమజయంతి , 27న సహస్ర కలశాభిషేకం, 30న పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు.