- ప్రభుత్వ శాఖల్లో అవినీతి తిమింగలాలు ఎన్నో!
- ఏసీబీ దాడులకు పట్టుబడింది కొందరే..
- ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన వారి సంగతి చూడాలి..
- ప్రభుత్వం వద్ద అక్రమాస్తులు కూడబెట్టిన వారి సమాచారం’
- ఒకేరోజు నలుగురు అవినీతిపరుల పట్టివేత
- ఏసీబీ చరిత్రలో రికార్డు
ఏసీబీ అధికారులు వరుసగా చేస్తున్న దాడులు ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. ఏసీబీ నిర్వహిస్తున్న ఈ దాడులు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈరోజు ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ శాఖ నుంచి ఏసీబీ అధికారులకు ట్రాప్ అయినట్లు వినవలసి వస్తుందోనని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు…. ఇటీవల ఏసీబీ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తుండడం అవినీతి అధికారుల్లో దడ పుట్టిస్తుందనే విషయంలో సందేహం లేదు… అవినీతి ఎక్కువ ఉందని భావిస్తున్న శాఖల్లో రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, ఆర్టీఏ, పిసిబి(PCB), మైనింగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అటవీ, హెల్త్, వ్యవసాయ శాఖలు ముందున్నయని చెబుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతాధికారులు సంపాదించుకున్న ఆస్తుల వివరాలు చూస్తే నోరెళ్లపెట్టాల్సిందే. ఒక్కొక్కరూ వందల కోట్లు రూపాయలు వెనకేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తుండగా వాటిపై ఈ ప్రభుత్వం విచారణ కొనసాగిస్తుంది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సహా ఇతర పనుల్లో పనిచేసిన ఆఫీసర్లపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఏసీబీ సోదాల్లో అధికారుల ఆస్తులు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అంటే నెలనెలా జీతాల మీద ఆధారపడి జీవిస్తారనే అభిప్రాయం ఉంది. కానీ, రూ.వందల కోట్ల ఆస్తులు లభ్యం కావడం చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కుంటే దొర అన్నట్టు ఉంది.. తెలంగాణాలో అధికారులు పరిస్థితి. పదేళ్లల్లో పలు ప్రాజెక్టులు, జరిగిన ఇతర పనుల్లో భారీగా డబ్బు సంపాదించుకున్నరనే ఆరోపణలు నిజమవుతున్నాయి. దొరికిన తిమింగళాలు కొన్నేనని.. దొరకాల్సినవి మరెన్నో ఉన్నాయని ప్రభుత్వం మరింత సీరియస్ గా వ్యవహరించి ఏసీబీ దాడులు చేస్తే ఇంకా ఎక్కువ మంది అక్రమ ఆస్తులు బయటికి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు రూ.వందల కోట్లకు పడగెత్తి ఉన్నారని అంచనా వేస్తున్నారు. అనేక మందిని ఏసీబీ అధికారులు పట్టుకున్నా.. వారిలో ఇద్దరు భారీ తిమింగళాలను గుర్తించి పట్టుకున్నది. వీరిలో ఒకరు మున్సిపల్ శాఖకు చెందిన శివబాలకృష్ణ కాగా, మరొకరు నీటిపారుదల శాఖలో హరిరాం. రాష్ట్రంలో రూ.500 నుంచి 1,000 కోట్ల వరకు సంపాదించిన అధికారులు కనీసం 80 – 100 మందికి పైగా ఆఫీసర్లు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలిసింది.
ప్రభుత్వం వద్ద అక్రమాస్తులు కూడబెట్టిన వారి సమాచారం:
కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆయన ఆస్తులు చూసి ఏసీబీ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. శివబాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా ప్రభుత్వంలోని కీలక ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఆస్తులు పత్రాలు కూడా ఆయన దగ్గర లభ్యమయ్యాయి. వారికి ఆయన బినామీగా వ్యవహరించినట్టుగా తెలిసింది. మున్సిపల్ శాఖలో ప్రణాళిక విభాగంలో పనిచేసిన శివబాలకృష్ణ ఆస్తులు ఈ విధంగా లభ్యం కావడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. శివబాలకృష్ణపై ఏసీబీ సోదాలు జరిగిన సమయంలో ఇలా అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్న అధికారులు వివిధ శాఖల్లో కలిపి మొత్తం కనీసం 80-100 మంది ఉన్నారని సమాచారం ప్రభుత్వానికి అందింది. వారి వివరాలన్నీ సేకరించి దగ్గర పెట్టుకున్నారు. వారిపైన ఎప్పుడైనా దాడులు జరపొచ్చని సమాచారం.
ఏసీబీకి చిక్కిన ఆ…నలుగురు
ఒకే రోజు నలుగురు అవినీతి పరులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రాష్ట్ర ఏసీబీ అధికారులు రికార్డు నెలకొల్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న ముగ్గురు లంచగొండులను పట్టుకున్న ఏసీబీ అధికారులు సోమవారం ఏకంగా నలుగురిని పట్టుకుని రికార్డు సృష్టించారు. ఈక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ, జనగామ జిల్లా చిల్పూర్ రెవెన్యూ అధికారి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాగారం మున్సిపల్ డీఈఈ సుదర్శనం రఘు లంచం కేసులో ఏసీబీ వలకు చిక్కారు. నగర శివారులోని నాగారం మున్సిపాలిటీ డీఈఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. లక్ష రూపాయలు తీసుకున్నట్లు తేలడంతో అరెస్ట్ చేశారు. నాగారం మున్సి పల్ పరిధిలో కార్యాలయంలో సీసీ రోడ్డు పనులకు సంబంధించి రూ. 11 లక్షల బిల్లు మంజూరు చేయాలని కాంట్రాక్టర్ డీఈ సుదర్శనం రఘును సంప్రదించాడు. ఈక్రమంలో రూ.1.30 వేలు లంచం ఇవ్వాలని, ఆయా మొత్తాలను వర్క్ ఇన్స్ స్పెక్టర్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాకేష్, సురేష్ లకు ఇవ్వాలని సూచించాడు. బాధిత కాంట్రాక్టర్ ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించి డీఈపై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాలలో తొలివిడతగా రూ. లక్ష నగదును ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాకేష్, సురేష్ లు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారించారు. ఏసీబీ విచారణలో డీఈఈ సుదర్శనం రఘు ఆదేశాల మేరకు లంచం మొత్తాలు తీసుకున్నామని చెప్పడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డీఈఈ తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పంచాయతీ రాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ రూ.7 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సిసి రోడ్డు పనులకు సంబంధించి రూ.4.75 లక్షల బిల్లులను మంజూరు చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ రూ. 10వేలు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు.
ఓ భూమిలో కేసులో రూ. 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ ను ఖమ్మం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మణుగూరు మండల కేంద్రంలో సీఐ సతీష్ కుమార్ గత నెల రోజుల నుంచి ఓ భూమి విషయంలో తల దూర్చి బాధితులను ఇబ్బంది పెడుతున్నట్లు బాధితులు నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
భూ వివాదంలో సీఐ సదరు బాధితులను రూ. 4 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదరు సీఐ మణుగూరు మండలంలో ఓ రిపోర్టరుకు డబ్బులు వసూళ్లు చేసే బాధ్యతను అప్పగించాడు. ఇందులో భాగంగా మొత్తం రూ. 4 లక్షల లంచానికి సంబంధించి తొలివిడత రూ. లక్ష చెల్లించే క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సీఐ, రిపోర్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీఐతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన రిపోర్టర్ ను అరెస్ట్ చేసి వరంగల్ ఎసీబీ కోర్టులో హాజరుపరిచారు.
జనగాంలో జిల్లా చిల్పూర్ ఆర్ఐ వినీత్ కుమార్ రూ. 26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కా డు. లంచం మొత్తలను తన షిఫ్ట్ కారు సీటుకింద దాచిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ మొత్తాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. చిల్పూర్ మండల పరిధిలో ఓ ల్యాండ్ ముటేషన్ పై వెరిఫికేషన్ చేయాలంటూ సదరు ల్యాండ్ సోదరుడు ఆర్ఐ వినిత్ కుమార్ ను సంప్రదించాడు.
ఈక్రమంలో రూ.50వేల లంచం డిమాండ్ చేయడంతో రూ. 26వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అయితే బాధితుడు తనను లంచం అడిగిన ఆర్ఐపై ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.