- సీఎస్ గా రామకృష్ణారావు చార్జ్ తీసుకున్న తర్వాత..
- స్పెషల్ సీఎస్ ల నుంచి కలెక్టర్ల వరకు బదిలీలు..
- పనితీరు సరిగాలేని ఆఫీసర్లపై వేటు
- ఇప్పటికే పలువురు అధికారులపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు
రెండు రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం త్వరలోనే మరికొందరిని ట్రాన్ ఫర్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. సీఎస్ గా రామ కృష్ణారావు ఈనెల 30న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత బదిలీలు ఉంటాయనే ప్రచారం జరుగుతున్నది. పనితీరు సరిగాలేని ఆఫీసర్లను ప్రస్తుతమున్న బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో సమర్థులను నియమిస్తారని టాక్. ప్రధానంగా సెక్రెటేరియట్, వివిధ హెచ్ఐడీ స్థాయిలో పనిచేస్తున్న అధికారులను తప్పిస్తారని తెలుస్తోంది. పలువురు ఐఏఎస్ ల తీరుపై ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేధావులు సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేసినట్టు చర్చ జరుగుతున్నది.
ఐఏఎస్ ల బదిలీలు భారీస్థాయిలోనే ఉంటాయనే ప్రచారం జరుగుతున్నది. ఆ జాబితాలో స్పెషల్ సీఎస్ లు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు, హెచ్ఒడిలు, కొన్ని జిల్లాల కలెక్టర్లు సైతం ఉంటారని తెలుస్తున్నది. ఈ అంశంపై ఇప్పటికే రామకృష్ణరావుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు అధికారుల పనితీరుపైనా ఆయన ఆరా తీసినట్టు సమాచారం. కొందరు సెక్రెటరీలు, హెచ్ఓడీలు, కలెక్టర్లు సరిగా పనిచేయడం లేదని, సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతున్నట్టు విమర్శలున్నాయి. మరికొందరు ఆఫీసర్లు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేధావులతో అమర్యాదగా ప్రవర్తించారనే ఫిర్యాదులు సీఎం రేవంత్ కు అందాయి. అలాంటి అధికారులపై వేటు వేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ప్రాధాన్యం లేని పోస్టుకు వారిని ట్రాన్స్ ఫర్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే దాన కిషోర్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను మొదట సీఎంవోలోకి తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు టాక్. కానీ, మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆయన తనకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడంలో, మూసీ అభివృద్ధి చేపట్టే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటుగా మున్సిపల్ శాఖలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయన మంత్రులు చెప్పినా వినడం లేదని, కనీసం స్పందించడం లేదని వారు సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ మేరకు నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి ఆయనకు అప్రాధాన్య పోస్టు కేటాయించి నట్టు టాక్. మొన్నటివరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన ఆయన్ను.. ఆ పోస్టు నుంచి తప్పించి.. కార్మిక, పర్యావరణం, కమిషనర్ లేబర్, గవర్నర్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. స్మితా సబర్వాల్ పై విమర్శలు రావడంతో ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీగా సర్కారు నియమించింది. వాస్తవానికి అక్కడ ఒక సీనియర్ ఐఏఎస్ చేసేంత పని ఏమీ ఉండదు. కానీ, పనిష్ మెంట్లో భాగంగానే ప్రభుత్వం ఆమెను ఆ పోస్టుకు ట్రాన్స్ ఫర్ చేసినట్టు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి తో నూతన సీఎస్ రామకృష్ణారావు భేటీ
రామకృష్ణారావును తదుపరి సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ని రామకృష్ణారావు సోమవారం కలిశారు. తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలయ్యే విధంగా చూస్తానని వివరించారు. అధికారులు అందరితో సమన్వయం చేసుకొని పథకాలను ప్రజలకు చేరేలా చూస్తానని వివరిం చారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉండే విధంగా పనిచేస్తానని సీఎంకు వెల్లడించినట్లు తెలిసింది.