ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం (గజ్వేల్) ఈఎన్‌సీ బి. హరిరామ్ నాయక్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు విడుదల చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా కేసులో అరెస్టై, రిమాండ్‌కు వెళితే.. వారిని 48 గంటల్లోపు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. ఇందులో భాగంగానే హరిరామ్‌పై చర్యలు తీసుకున్నారు. ఈఎన్‌సీ హరిరామ్ ఇంటితోపాటు మరో 14 చోట్ల ఏసీబీ ఈనెల 26న దాడులు చేసి, భారీగా ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న మర్కూక్ మండలంలోనే హరిరామ్‌కు 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. షేక్‌పేట్, కొండాపూర్‌లలో విల్లాలు.. శ్రీనగర్ కాలనీలో రెండు ఇళ్లు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్‌లలో ఫ్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, బొమ్మలరామారంలో 6 ఎకరాల మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలలో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేల్చారు.
బంగారు అభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు. హరిరామ్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీగా ఆస్తులు పోగేశారని ఏసీబీ ప్రకటించింది. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సుమారు రూ.1.47 లక్షల కోట్లుకాగా.. అందులో రూ.48,665 కోట్ల విలువైన పనులు హరిరామ్ పర్యవేక్షణలోనే జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. నిజానికి హరిరామ్ మొదట్లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా పనిచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ-ఇంజనీరింగ్ పేరుతో ఆ ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతుల కోసం ప్రాజెక్టు ప్రపోనెంట్ హోదాలో హరిరామ్ దరఖాస్తు చేయడం గమనార్హం. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ఎండీ హోదాలో ప్రాజెక్టుకు భారీగా రుణాల సమీకరణలోనూ కీలకంగా వ్యవహరించారు..