- పదుల సంఖ్యలో దొరికిపోతున్నభయపడని అవినీతి అధికారులు
- ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఏసీబీ దృష్టి..
- చురుకుగా పనిచేస్తున్న ఏసీబీ..
లక్షల్లో జీతాలు అయినా బుద్ధి మారదు. వక్రమార్గంలో సంపాదనే వారికి ముద్దు. కోట్ల రూపాయల అక్రమార్జనే వారి ప్రధాన లక్ష్యం. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న వారికి పట్టదు. ఏసీబీ అధికారులు ఇటీవల జరుపుతున్న దాడుల్లో అనేకమంది పెద్ద పెద్ద తిమింగలాలు అధికారులకు దొరికిపోతున్నారు. కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకొని కటకటాల వెనక్కు పంపుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. సమాచారం ఇస్తే ఏసీబీ అధికార యంత్రాంగం రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు.
కేవలం 120 రోజుల వ్యవధిలోనే 100 మంది అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిరంతరం దాడులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు జంకు లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు.
ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అధికారులు దాడులు చేసిన క్రమంలో అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. ఇటీవల ప్రధాన శాఖలపై ఏసీబీ అధికారులు నిఘా కొనసాగిస్తున్నట్లు సమాచారం. రెవిన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, విద్యుత్, మున్సిపల్, పీసీబీ, మైనింగ్, హెల్త్, ఎక్సైజ్, అటవీ శాఖలో అవినీతి పతాక స్థాయికి చేరింది అనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, విద్యుత్ అధికారులు ఏసీబీ అధికారులకు దొరికిపోతున్నారు. తెలంగాణలో ఉన్న అవినీతి అధికార యంత్రాంగంపై ఏసీబీ అధికారులు నిఘా కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కాలంలో అనేక మంది అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.
ఫిర్యాదులు చేస్తేనే ఏసీబీ దాడులు జరుతాయి. లేకుంటే లేదు అనే అభిప్రాయం పోగొట్టాలని ఇకపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులపై కూడా దృష్టి పెట్టాలని ఏసీబీ చూస్తున్నట్టు తెలుస్తున్నది. అప్పుడే ఏసీబీపై నమ్మకం పెరుగుతుందని మేధావులు కూడా చెబుతున్నారు. ఫిర్యాదులు రాకున్న కూడా అనేక ప్రభుత్వ సంస్థల్లో విపరీతంగా అవినీతి జరుగుతుందని పలువురు చెబుతున్నారు.
ఏసీబీ అధికారులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా విధులు నిర్వర్తించాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ కింది స్థాయి అధికారులకు తేల్చిచెబుతున్నారు. ప్రజల్లో నమ్మకం ఏర్పడినప్పుడే అవినీతిపరుల గుట్టు రట్టవుతుందని వివరిస్తున్నారు. గడచిన నాలుగు నెలల్లో ఏసీబీ అధికారులు సమర్ధవంతంగా పని చేయడం వల్ల ఏసీబీపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. అవినీతిపరులపై అందిన ఫిర్యాదులపై ప్రతి ఒక్కరూ సకాలంలో స్పందించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విచారణలో ఉన్న కేసులు, ప్రాసిక్యూషన్ ఉత్తర్వులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న కేసులు, ముసాయిదా తుది నివేదికలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, ట్రయల్స్ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆదేశించారు.