- ఏసీబీకి పట్టుబడుతున్నా మారని ఉద్యోగుల తీరు
- ఇప్పటికీ ఏసీబీకి దొరికింది కొందరే..!
- ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ప్రభుత్వ అధికారులు ఎందరో..!
“ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా మామూళ్లమయం”.. అని ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇదీ.. అదీ అని లేకుండా దాదాపుగా అన్ని శాఖల్లోనూ కొంతమంది ఉద్యోగులు ప్రతి పనికి పైసాతోనే ముడిపెడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో దస్త్రం కదలాలన్నా.. రావాల్సిన జీతం ఠంచనుగా చేతికందాలన్నా ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నాలుగు జిల్లాల్లో ఇంతకింతకు పెరుగుతోంది. ఇంత ఇస్తేనే ఈ పని చేస్తామనే పంథా కొందరు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వినిపిస్తుండటం బాధాకరం.
ప్రతి శాఖలో ఉన్న అవినీతి అధికారుల్లో కొంతమంది మాత్రమే ఏసీబీ పట్టుబడుతున్నారు. అది కూడా డబ్బులు ఇవ్వమని వ్యతిరేకిస్తూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన వారు అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నిత్యం వందలాది మంది ప్రతి పనికి సిబ్బంది, ఉద్యోగులు అడిగినంత చేతిలో పెట్టేసి కావాల్సిన పనిని చక్కబెట్టుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా తమ పని పూర్తయితే చాలనే తీరున వ్యవహరిస్తున్నారు. దొరకకుండా తప్పించుకునే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. కానీ ప్రజల్లో లంచం ఇవ్వం అన్న భావన మరింతగా పెరగాల్సిన అవసరముంది. ఆయా శాఖల్లోని ప్రభుత్వ సిబ్బంది వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందుతున్నా కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల పైసలు అడిగే తంతు ఇంతకింతకు పెరుగుతోంది. ఆయా శాఖల్లోని ఉన్నతాధికారులు కూడా తమ సిబ్బంది పారదర్శకంగా పనులు చేసే విధంగా పర్యవేక్షణ చేస్తూ లంచాలకు దూరంగా ఉండే విధంగా సంస్కరణలు చేపడితే ప్రజలకు మేలు జరుగుతుంది.
ఈ ఏడాది ఒక్క కరీంనగర్ జిల్లాలో 14 మంది పట్టుబడ్డారు..
ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఒక్క కరీంనగర్ జిల్లాలో 14 మంది ప్రభుత్వ ఉద్యోగులు పని కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముఖ్యంగా కీలకమైన పోలీసు, రెవెన్యూ శాఖల్లోని అధికారులు పట్టుబడుతుండటం గమనార్హం. తరచూ అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మారకపోవడం గమనార్హం. ప్రతి ఏడాది నెలకు సగటున ఒకరు పట్టుబడుతుండగా ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో సగటున నెలకు నలుగురు దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది.