భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. కంటోన్మెంట్ ఏరియాలోనూ బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధమన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫస్లీ (నం. IX) సెక్షన్ 67 (సి) కింద ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నిషేధాజ్ఞలు తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతాయని తెలిపారు.
పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలోనైనా సరే బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉంటుందని తెలిపారు. బాణాసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. బాణాసంచా కాల్చితే జైలుకు పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో బాణాసంచా నిషేధానికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం, నగరంలో భద్రతా చర్యలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాణాసంచా శబ్దాలను పేలుళ్లుగా అన్వయించుకునే ప్రమాదం ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు. అంతేకాకుండా, బాణాసంచా శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో, బాణాసంచా కాల్చడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించడం కష్టమవుతుంది.