- అవినీతి మడుగులో ఈదులాడుతున్న కాలుష్య నియంత్రణ మండళ్లు (పీసీబీ)..!
- పీసీబీల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేసేదేప్పుడు..?
- కాలుష్య పరిశ్రమలను సమూలంగా ప్రక్షాళిస్తాయా..?
- పీసీబీ నిబంధనలను తుంగలో తొక్కుతున్న కర్మాగారాలను మూసేయిస్తాయా..?
- భవిష్యత్తు తరాలకు సరైన భద్రత కల్పిస్తాయా..?
తమ స్వార్థం కోసం సమాజానికి తీవ్ర హాని చేస్తున్న ప్రజా శత్రువులు దేశవ్యాప్తంగా యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. కనీస విచక్షణ మరచి ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. వారి వల్ల జన జీవనానికి ప్రాణాధారమైన జల వనరులు విషతుల్యం అవుతున్నాయి. పంట భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. భూగర్భ జలాల్లోనూ భారలోహాలు పేరుకుపోతున్నాయి. ప్రజలను క్యాన్సర్లు, చర్మ వ్యాధులు చుట్టుముడుతున్నాయి, కాలుష్య నియంత్రణ మండళ్ల (పీసీబీ)ల చేవచచ్చినతనం, అవినీతి మడుగులో ఈదులాడుతున్న అధికార యంత్రాంగం మూలంగా రసాయనాల ఉత్పాతం నానాటికీ ప్రబలమవుతోంది..!
వస్తూత్పత్తుల సమయంలో వెలువడే ప్రమాదకర రసాయనాల శుద్ధికోసం పరిశ్రమలు ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పాలి. లెడ్, జింక్, మాంగనీస్ వంటి లోహాల శుద్ధి పరిశ్రమలు ప్రమాదకర వ్యర్థాలను వాటి నిర్వహణ కేంద్రాలకు తరలించి భస్మం చేయించాలి. డబ్బులు మిగుల్చుకోవాలన్న కక్కుర్తితో చాలా సంస్థలు గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను అర్ధరాత్రో, అపరాత్రో దగ్గరిలోని డ్రైనేజీలు, చెరువులు, కుంటలు, వాగులు, నదుల్లో కుమ్మరిస్తున్నాయి. సమీప అడవులు, మైదానాలు, ఖాళీస్థలాల్లోనూ వాటిని పారబోస్తున్నాయి. కొన్ని సంస్థలైతే అతి తెలివిలో నక్కల్ని మించిపోతున్నాయి. వ్యర్ధాలను డ్రమ్ములు, ట్యాంకుల్లో నిల్వ ఉంచి, వర్షం కురిసినప్పుడు యమ దర్జాగా బయటకు వదిలేస్తున్నాయి. దాంతో వరదతో పాటు రసాయనాల నురుగు పారిశ్రామిక వాడల్లోని కాలనీలను కమ్మేస్తోంది. జనావాసాల సమీపంలోనే వ్యర్థాలను విసిరేస్తుండటంతో వాటి నుంచి వచ్చే గాడ వాసనలకు స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బోరు నీరు సైతం తీవ్ర దుర్వాసనతో రంగుమారి వస్తోందని వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో రెండు వేలకు పైగా పరిశ్రమలుంటే, వాటిలో 30శాతం తమ రసాయన వ్యర్థాలను దూలపల్లి, కీసర అటవీ ప్రాంతంలో పారేస్తున్నాయి. అడపాదడపా ఇలాంటి వాటిపై కన్నెర్ర చేస్తున్న పీసీబీ అధికారులు, అనంతరం అటువైపు తిరిగి చూడటంలేదు. ఈ దారుణ నిరక్ష్యమే నీతిబాహ్య సంస్థలకు వరమవుతోంది..!
పారిశ్రామిక వ్యర్థాలతో జలవనరుల ఉసురు తీస్తున్నవారిపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యర్థాల శుద్ధి కేంద్రాలను సక్రమంగా నిర్వహించని సంస్థలను మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ, న్యాయపాలిక ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయని పెడసరితనం అధికార యంత్రాంగంలో పెరిగిపోయింది. ప్రజారోగ్యానికి అదే పీడగా తయారైంది. మురుగు కాలువలో వ్యర్థాలను వదిలిపెట్టిన పరిశ్రమల పాతకం మూలంగా విషవాయువులు చుట్టుముట్టి రెండేళ్ల క్రితం పంజాబ్ లోని లూధియానాలో 11 మంది బలయ్యారు. అందులో ముగ్గురు పసికందులూ ఉన్నారు. పవిత్ర గంగానది తీవ్రంగా మలినమైపోవడానికి ప్రధాన కారణాల్లో పారిశ్రామిక వ్యర్థాల చేరికా ఒకటి. కర్మాగారాల నుంచి వచ్చి కలుస్తున్న హానికారక రసాయనాలతో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ఎన్నో చోట్ల జీవనదులు నరకయాతన అనుభవిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించినంత మేరా గోదావరి, కృష్ణలో మురుగునీరు, ఘన వ్యర్ధాలు మొదలు పారిశ్రామిక విషరసాయనాలు భారీగా చేరిపోతున్నాయి. సమీప పట్టణాల్లోంచి ఫ్యాక్టరీల వ్యర్ధాలు కృష్ణానదిలోకి వెల్లువెత్తుతున్నాయి. మూసీ, మానేరు, తుంగభద్ర, పెన్నా వంటివీ డంపింగ్ యార్డులవుతున్నాయి. ఇలాంటి నీటితో పండించిన పంటల ద్వారా భార లోహాలు మానవ శరీరంలోకి వచ్చి తిష్టవేస్తున్నాయి. యమునా పరీవాహకంలో ఇంధన వనరుల సంస్థ (టెరి) చేపట్టిన అధ్యయనంలో ఈ ఆందోళనకర వాస్తవం వెలుగుచూసింది. మురుగు, రసాయనాల ఉదృతితో మూసీ నీటిలో క్యాన్సర్ కారక ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికెల్, లెడ్ వంటి రసాయనాల ఉద్ధృతి పెరిగి పోయింది. ఈ క్రమంలో ఆ నదీ పరీవాహకంలో ఆహార పంటలు నిలిపేసి పూలసాగు మాత్రమే చేపట్టేలా చూడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించడం దిగజారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది.
కలుషిత జలాల కారణంగా దేశీయంగా ఏటా రెండు లక్షల ప్రాణాలు కడతేరిపోతున్నాయి. ప్రమాదకర వ్యర్ధాలను ఇష్టారీతిగా పారబోయడం – సామూహిక జనహననానికి తెగబడటమంతటి నేరం. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తిస్తాయా? కట్టుతప్పుతున్న పరిశ్రమల నిర్వాహకులకు కఠిన శిక్షలు విధిస్తాయా? పీసీబీల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేయడంతో పాటు వాటిని సమూలంగా ప్రక్షాళిస్తాయా? నిబంధనలను తుంగలో తొక్కుతున్న కర్మాగారాలను మూసేయిస్తాయా? భవిష్యత్తు తరాలకు సరైన భద్రత కల్పించేందుకు పాటుపడతాయా? ఈ ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం చెప్పడమే కాదు, ఆచరణలో ఆ మేరకు చిత్తశుద్ధి చూపించాలంటే ముందు ప్రజాసంక్షేమం పట్ల పాలకులకు బాధ్యతతో కూడిన ప్రేమ ఉండాలి. మాటల్లో కాదు చేతల్లో అది కనపడాలి..! (సోర్స్: వేణు బాబు మన్నం, ఈనాడు)