అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తున్న గూడులేని చెంచులకు 10 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఉట్నూరు, భద్రాచ లం, మున్ననూర్, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో శాచురేషన్ మోడ్‌లో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇండ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గవర్నర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కేటాయించాలని తొలుత భావించినప్పటికీ, ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాల్లో 500-700 వరకు అదనంగా ఇండ్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
ఉట్నూర్ ఐటీడీఏ పరిధి ఆసిఫాబాద్‌లో 3,551, బోధ్‌లో 695, ఖానాపూర్‌లో 1,802, సిర్పూర్లో 311, అదిలాబాద్‌లో 1,430, బెల్లంపల్లిలో 326, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అశ్వారావుపేటలో 105, మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్టులోని అచ్చంపేటలో 518, మహబూబ్‌నగర్‌లో 153, పరిగిలో 138, తాండూర్‌లో 184, మొత్తం 9,395 ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలికి వచ్చిందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలు, జీహెచ్ఎంసీ పరిధిలో ఇన్ సిటూ పద్ధతిలో జీ+3 అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్టు మంత్రి పొంగులేటి వివరించారు.