కాలుష్య పరిశ్రమలను ప్రోత్సహించవద్దు: ప్రొఫెసర్‌ హరగోపాల్‌

కాలుష్య కారక పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహించవద్దని, అందుకు సంబంధించిన అనుమతులు రద్దుచేయాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీపీజేఏసీ), ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడారు.

పర్యావరణానికి, ప్రజలకు నష్టం కలిగేలా కాంగ్రెస్‌ పాలన సాగుతున్నదని మండిపడ్డారు. కార్పొరేట్‌ విధానంలో పాలనను నడుపుతున్నారని, ప్రజలను కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ పేరుతో పర్యావరణం, ప్రకృతిని ధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా పరిశ్రమలు, ఇథనాల్‌ పరిశ్రమలు అంత్యంత ప్రమాదకరమైనవని, వాటిని నెలకొల్పడం ద్వారా భవిష్యత్తు తరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రజల వ్యవసాయ భూములను లాక్కుని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడతామని చూస్తే ప్రజలు మరో ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విధ్వంస పాలనను కొనసాగిస్తే.. పౌరసమాజం తిరగబడుతుందని, ప్రజలు ప్రత్యామ్నాయానికి తెర తీస్తారని స్పష్టంచేశారు. మార్పు పేరుతో కాంగ్రెస్‌ నాయకులు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించారని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతిపనికీ ప్రజలకు, ప్రజా సంఘాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాసంఘాలను సంఘటితం చేసి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని హరగోపాల్‌ ప్రకటించారు.

ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రజా వ్యతిరేక పనులతో, రాజకీయ తప్పిదాలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూట్టగట్టుకున్నదని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు విమర్శించారు. మూసీ, హైడ్రా పేరుతో ప్రణాళిక లేకుండా బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూలుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పర్యావరణ, ప్రకృతి సంపదకు కేంద్రమైన దామగుండం అడవిని కేంద్రానికి రాసిచ్చి విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ప్రైవేట్‌పరంచేసేలా పాతబస్తీ విద్యుత్తు బిల్లుల వసూళ్లను అదానీ కంపెనీకి ఇస్తూ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదిక రాకముందే కాంట్రాక్టర్‌ మెగా కృష్ణారెడ్డితో సఖ్యత పెంచుకుని.. ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కృషిచేసిన మహిళలు, ఉద్యోగులు, ముస్లింలను అన్నివిధాలా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తూనే.. ఎలాంటి ఉపయోగం లేని అందాల పోటీలను నిర్వహిస్తూ, అడ్డుకున్న వారిని నిర్బంధించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విధ్వంసకర అభివృద్ధి నమూనాను పక్కనబెట్టి రాష్ట్ర వాస్తవ అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు.