తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, హాస్టళ్ల నిర్వహణపై మంగళవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎస్ సూచించారు. విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను వారి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొమ్మును డ్రా చేసుకోవడానికి ఇచ్చే డెబిట్ కార్డుల వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన సబ్బులు, కాస్మెటిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తోన్న మొబైల్ విక్రయ కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీదర్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.వర్షిణి, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
