అవినీతి అధికారులపై.. ఏసీబీ పంజా

  • నీడలా వెంటాడుతున్న ఏసీబీ
  • మారని తీరుతో మారుతున్న అవినీతి అధికారుల తలరాతలు
  • లంచం మత్తులో చిద్రమవుతున్న అవినీతి అధికారుల కుటుంబాలు
  • అవినీతి అధికారులపై పెరుగుతున్న ఫిర్యాదులు, ఆగని ఏసీబీ దాడులు
  • ఆదాయానికి మించి అస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల సంగతి చూడాలంటున్న ఫిర్యాదుదారులు

లంచం మత్తులో కొంతమంది అధికారులు తమ కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారు. కొంతమంది అధికారులకు లంచం అనే పెనుభూతం ఆవహించి దాని మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. డబ్బు మీద పెరిగిన వ్యామోహం. సమాజంలో ఆర్థిక స్థాయిని పెంచుకునే క్రమంలో కొంతమంది అధికారులు లంచావతారులుగా మారుతున్నారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలో పోలీస్ శాఖకు సంబంధించిన డీఎస్పీ, సిఐ స్థాయికి చెందిన ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరకటం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. ఒక శాఖలో డిఎస్పీ స్థాయిలో పనిచేస్తున్న అధికారి అవినీతికి పాల్పడుతూ మరొక శాఖలో వనిచేస్తున్న డీఎస్పీ స్థాయి అధికారికి పట్టుబడటం విశేషం… ఏ శాఖలో పనిచేసే ఏ స్థాయి అధికారైన…. లంచం అడుగుతున్నట్లు ఫిర్యాదు అందుతే చాలు…. ఏసీబీ అధికారులు మాత్రం “తగ్గేదేలే” అంటూ దాడులు చేసి అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు…. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు అనేక కేసులు నమోదు చేశారు…. ఈ కేసులలో పలువురు అధికారులు, కొంతమంది సంబంధిత శాఖల సిబ్బంది జైలు పాలు కావలసి వచ్చింది. అయినా కొన్ని శాఖల్లోని కొంతమంది అధికారులు తీరు మార్చుకోకపోవడంతో వారి తలరాతలు మారి చెరసాల పాలవుతున్నారు…. కొంతమంది అధికారులు తమ స్థాయిలను మరిచి అవలంబిస్తున్న తీరుతో ఇలాంటి సంఘటనలు సమాజం చూడాల్సి వస్తుంది.. ప్రస్తుత సమాజానికి, భవిష్యత్తు తరాలకు మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అధికారులలో కొంతమంది సమాజం, మెసేజ్ మాట దేవుడెరుగు తమ కుటుంబాలను చేతులారా చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు. గత నెలలో పోలీస్ శాఖలో చింతలపాలెం ఎస్సై లంచం తీసుకుంటుండగా పట్టుబడగా, ఇప్పుడు తాజాగా సూర్యాపేటలో డిఎస్పి తో పాటు సిఐ లాంటి అధికారులే కాక అనేక చోట్ల లంచం విషయంలో పలువురు పట్టుబడటం పోలీస్ శాఖలో మాయని మచ్చగా నిలిచింది. కొంతమంది అధికారుల తీరు శాఖలో నిజాయితీగా పని చేస్తున్న అధికారులకు ఇటువంటి సంఘటనలు తలనొప్పిగా మారుతున్నాయి అనడంలో సందేహం లేదు. మారుతున్న సమాజంలో ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం లంచావతారులకు సవాల్ విసురుతుంది. జనంలో పెరిగిన చైతన్యంతోనే ఇటీవల అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులు పెరగటంతో ఏసీబీ అధికారులు దాడులు కూడా పెంచుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎంతో చాకచక్యంగా, పకడ్బందీగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కేసులు నమోదు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏసీబీ అధికారులు బాధితులు చేస్తున్న ఫిర్యాదులతో లంచం అడిగిన అధికారులను పట్టుకోవడంలో వరుసగా ఇటీవల మంచి ఫలితాలు సాధిస్తున్న అవినీతి నిరోధక శాఖ ప్రజల్లో, బాధితులలో మరింత నమ్మకాన్ని పెంచుకుంటుంది. ఒక పోలీసు శాఖలోనే కాకుండా రెవెన్యూ, అటవీ, మైనింగ్, పీసీబీ, రిజిస్ట్రర్, ఆర్ టిఏ లాంటి మిగిలిన అనేక ప్రభుత్వ శాఖల్లో కూడా లంచం లేనిదే అధికారులు పనిచేయడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అధికారుల వద్దకు ఏదో ఒక సమస్యపై వస్తున్న బాధితులను సంబంధిత అధికారులు లంచం రూపంలో పట్టు విడుపులు లేకుండా వేధిస్తుండడంతో… విసుగు చెందుతున్న బాధితులు తట్టుకోలేని పరిస్థితిల్లో అడిగినంత లంచం ఇవ్వలేక… తమ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతూ… ఏసీబీ అధికారులకు పట్టిస్తే లంచం అడిగిన అధికారుల జీవితాలు, వారి కుటుంబాలు బలయితాయని తెలిసి కూడా విధి లేని పరిస్థితుల్లో కసితో బాధితులు అవినీతి శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారంటే.. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల మిన్నంటుతున్న అత్యాశకు జరుగుతున్న వరుస సంఘటనలు అద్దం పడుతున్నాయి… సంబంధిత శాఖలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతున్న కొంతమంది అవినీతి అధికారులు మాత్రం ఎలాంటి చలనం కలగకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.అంతేకాక ఫిర్యాదులు వస్తేనే చర్యలు చేపట్టడం కాదు.. ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి అస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల సంగతి చూడాలంటున్న ఫిర్యాదుదారులు.. దొరికే వారి దొరికారు… పట్టుకునే వాళ్ళు పట్టుకున్నారు… అంతే నాలుగు రోజుల పాటు చర్చించుకుంటారు… మర్చిపోతారు… మళ్లీ పాత కథే … యధా రాజా తథా ప్రజా అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తుండటం అతియోశక్తి లంచాలకు పాల్పడుతున్న అధికారులపై నీడలా వెంటపడుతున్న ఏసీబీ అధికారుల చర్యలతో ఇకనైనా అధికారుల తీరు మారుతుందా అనేది మాత్రం అందరూ వేచి చూడాల్సిందే..