- అవినీతిపరులకు రక్షణ కవచాలు ఎక్కువ అయినాయి..
- అవినీతిపరులలో కులం, మతం, ప్రాంతం ఐక్యత కనపడుతున్నది..
- ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెడుతున్న వారిని గాలికి వదిలేస్తున్నారు..?
- అవినీతి ఆరోపణలు వస్తున్న అధికారులపై కేసులు ఏవి..?
- అవినీతిపరులపై ప్రజా ఉద్యమాలు రావాలి..
అవినీతి విస్తరించి వేళ్లూనుకుంటోంది. అవినీతిపరుల సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో వైవిధ్యం ఉన్నది. అవినీతికి ఆజ్యం పోసే విధానాలు, వ్యవస్థ గురించి అవగాహన కూడా చాలా తక్కువ. అవినీతి ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న అక్రమ లావాదేవీగానే చూస్తున్నాం. అవినీతి వ్యక్తుల మధ్య జరిగే లావాదేవి మాత్రమే కాదు. ఉదాహరణకి, ఒక కాంట్రాక్టర్ ఒక అధికారికి లంచం ఇస్తే అది ఒక్కరికే పోదు. ఒక పెద్ద చైన్ లో అది ఒక భాగం, సంస్థలలో, ప్రభుత్వ యంత్రాంగాలలో పాతుకుపోయిన సమస్య అవినీతి నిర్ణయాధికారం ఉన్న ప్రతిచోట అవినీతికి ఆస్కారం ఉంది. మనకున్న అవినీతి వ్యతిరేక చట్టాలు కూడా ఈ రకమైన నిర్వచనం మీదనే ఆగిపోయాయి. ఒక అధికారిని పట్టుకున్నప్పుడు రంగునీళ్ల కరెన్సీ నోట్లను కోర్టుకు రుజువులుగా పరిగణించే ప్రాథమిక దశలోనే మనం ఉన్నాం. విశృంఖల అవినీతిని, క్రోనీ కేపిటలిజమ్ వగైరా అవినీతిని నియంత్రించే చట్టాలను మనం రూపొందించలేదు.
అవినీతి ప్రబలడానికి కారణాలు
రాజకీయ ప్రత్యర్థులు కూడా అవినీతి కేసులు వేయకపోవడం కుమ్మక్కు అవినీతికి నిదర్శనం. రెడ్ బుక్కులు, ఇతర బెదిరింపులు తమ మీద కేసులు రాకుండా చూసుకోవడం కోసమే. ప్రభుత్వ ఉత్తర్వులను ఇప్పుడు విధిగా దాచిపెడుతున్నారు. తెలంగాణలో 2014 నుంచి 2025 వరకు ఇచ్చిన 1,99,115 ప్రభుత్వ జీవోలలో కేవలం 82,657 మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్వయంగా శాసనసభలో చెప్పింది. ప్రజలకు అందుబాటులో ఉన్నవి దాదాపు 80 శాతం ప్రజలకు ఆవసరం లేనివి. ప్రజలకు అవసరమైనవి వారికి అందుబాటులో ఉండవు. వ్యాపారస్థులకు, కాంట్రాక్టర్లకు అవసరమైనవి వారికి నేరుగా అందిస్తారు. ఇటీవల వడగాడ్పు బాధితులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన జీవో ప్రజలకు అందుబాటులో లేదు.
అవినీతి వ్యవహారంలో ఇచ్చేవాడు బలహీనుడు. బలహీనులపై ఒత్తిడిని కూడా మన చట్టాలు గుర్తించడం లేదు. ‘ఇచ్చే’ ప్రతివాడు తప్పు చేసినవాడు కాదు. అనేకులు తమ హక్కుల కోసం, తమకు చెందినది పొందడానికి కూడా లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఈ సందర్భాలలో లంచం ఇచ్చేవాడు ఒక బాధితుడు. కలిసి దోచేవాడుగా పరిగణించలేం. అయితే, ఇంకొక రకం అవినీతిలో ‘ఇచ్చేవాడు’ కలిసి దోచుకునేవాడు. ఒక రాజకీయ నాయకునికి ఒక కాంట్రాక్టర్ లంచం ఇస్తే అది కలిసి దోచుకోవడమే. ఒక కార్యాలయంలో ఒక అధికారికి ఇచ్ఛే లంచం అందులో ఉన్నవారు పంచుకోవడం వరకు అవినీతి వ్యవస్థీకృతమైంది. అన్ని రకాల రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ఈ రకం లంచం సప్లయ్ చైన్ ఉంటుంది. నిర్ణాయక దస్తావేజు ఎక్కడడెక్కడకు పోతుందో వారందరికీ వాటా ఉంటుంది. ఆ వాటాలు పంచుకోవడంలో వచ్చిన గొడవలు కొన్నిసార్లు బహిర్గతం అయ్యాయి కూడా. అయితే, అవినీతి నిరోధక అధికారులు ఇప్పటికీ ఒక్క అధికారిని మాత్రమే పట్టుకుంటున్నారు. అదే కార్యాలయంలో నడుస్తున్న లంచాలను పంచుకునే వ్యవస్థను కదిలించడం లేదు. దీనికి రెండు కారణాలు ఉండే అవకాశం ఉంది. ఒకటి తీగ లాగితే అది ఎంత దూరం పోతుందో తెలియదు, రెండోది.. రుజువులు ఉండవు కనుక.
అవినీతిపరులకు రక్షణ కవచాలు
భారతదేశంలో ఆవినీతి పరుల రక్షణకు అనేక కవచాలు ఉన్నాయి. అందులో మొదటిది కనపడని లంచాల తీగ, లంచగొండులకు తీగ ఎంత పొడవు ఉంటే అంత ప్రయోజనం. ఆ మధ్య నకిలీ ఉన్నత చదువుల సర్టిఫికెట్లు పెట్టిన ఉపాధ్యాయులు వందలలో ఉండడంతో ప్రభుత్వం ఏమీ చేయలేక తదుపరి చర్యలు ఆపేశారు. ముంబై నుంచి వస్తున్న కారులో పెట్రోల్ పంపులోవాడే దొంగ చిప్స్ దొరికాయి, వాటిని కొనుక్కుని వాడిన పెట్రోల్ పంపులు అనేకం ఉండడంతో ఆ కేసు పక్కకు పెట్టేశారు. లంచాల దొంగను నాశనం చేస్తే కానీ ఫలితం రాదు. అయితే ఒక్కొక్క లంచాల తీగ చివరికి ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరకి చేరుతుంది. అందుకని, అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచాల తీగను అస్సలు గుంజరు కేసులో బలం లేకపోపటం కూడా ఒక రక్షణ కవచం. ఎంత పెద్ద తిమింగలం ఉంటే అంత రక్షణ. ఎందుకంటే వీరు తీసుకున్న నిర్ణయం ఇంకెవరో పెద్ద మనిషికి లాభం అయ్యింది. వారు సాక్ష్యం చెప్పరు. ఆ కారణంగా పట్టుబడిన అధికారి మీద లంచం ఆరోపణ నిలవదు. కేవలం ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల గురించి మాత్రమే కేసు ఉంటుంది. దాని నుంచి తొందరగానే బయటపడతారు. ఇక మూడవది, కులం, మతం, ప్రాంతం ఈ మధ్య ఇది బాగా కనపడుతున్నది. నాలుగవది. లోపాయికారిగా ఆవినీతిపరులకు అండగా ఉండే ఉద్యోగ సంఘాలు. ప్రతి సంఘం అదే పని చేయకపోవచ్చు. ఉద్యోగ సంఘాలను అవినీతిపరులు రక్షణ కవచంగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి.
అవినీతి నిర్వచనం
అధికారి తన విధులలో భాగంగా డబ్బు తీసుకుంటేనే అవినీతి అనుకుంటున్నాం. అధికారులు తమ అధికారాన్ని వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేయడాన్ని కూడా అవినీతిగా భావించాలి. అధికారం ఉపయోగించకపోవడం, సద్వినియోగం చేయకపోవడం కూడా అవినీతిలో భాగమే. రాజకీయ నాయకుల. అవినీతి చిట్టా చాంతాడు అంత ఉంటుంది. వీరి అవినీతికి అనేక రూపాలు అందులో మచ్చుకు కొన్ని: ఓటుకు నోటు (ఓటర్లను ప్రలోభపెట్టడం), కాంట్రాక్టులు కేటాయించడంలో అక్రమాలు, బినామీ ఆస్తులు (రాజకీయ నాయకుల పేరుపై కాకుండా ఇతరుల పేర్లపై ఆస్తులు), చట్టాలను మలుచుకునే విధానం (వ్యక్తిగత లాభాల కోసం విధానాలు మార్పులు). పాలనలో అవినీతి రూపాలు అక్రమ లావాదేవీలు (వివిధ వ్యాపారులతో), నిర్ణయాల ప్రక్రియలలో పారదర్శకత లేకపోవడం. ప్రతి నిర్ణయానికి లంచం, మంత్రులను కలవాలంటే గన్ మెన్ కు, సెక్రటేరియట్ సందర్శకులు అటెండర్లకు విరాళాలు ఇవ్వడం. ఇలా అనేకం ఉన్నాయి. తమ తోటి సహోద్యోగుల దస్తావేజుల క్లియరెన్స్ కూడా సొమ్ము లేనిదే కదలిస్తలేరు. సంక్షేమ పథకాలలో కూడా అవినీతి పరాకాష్టకు చేరింది.
ఆరోపణలు తప్ప కేసులు ఏవి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటికి మూడు ప్రభుత్వాలు ఏర్పడినాయి. జూన్ 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందు ఆరు నెలలలో కొన్ని వేల ఫైళ్లకు రెక్కలు వచ్చాయి. అనేక దస్త్రాలు మాయం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కేవలం: మాటలు చెప్పింది తప్పితే ఒక్కదాని మీద విచారణ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కేసులు. మాత్రం వేయడం లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అక్రమంగా కార్లు వాడుకున్న దగ్గర నుంచి కాళేశ్వరం. హరితహారంలో, మిషన్ భగీరథలో, మెట్రో రైలు, ధాన్యం కొనుగోళ్లు వంటి అనేక ‘బదా’ నిర్ణయాలలో, ప్రాజెక్టులలో అవినీతి స్పష్టంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం విచారణ కూడా చేయడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజా ఉద్యమం రావాలి
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి అవినీతి సామాజ్య విస్తరణకు ఉపయోగపడింది. భారీ ప్రాజెక్టులు ఆవినీతికి లోగిళ్లు అని వారే వెల్లడిస్తున్నారు. ప్రైవేటు కాలేజీలకు అనుమతులు. ఇసుక కుంభకోణాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భూకుంభకోణాలు మొదలైవాటి మీద ఆరోపణలు వచ్చినా ఒక్కరి మీద కూడా కేసులు పడలేదు. ఇంక అవినీతికి అడ్డుకట్ట ఏది? అప్పులు తెచ్చిమరీ అవినీతికి పాల్పడుతుంటే భావితరాల మీద భారం పెరుగుతుంది.. అవినీతి కట్టడికి ప్రజల నుంచి ఉద్యమం రావాలి. (సోర్స్: వెలుగు, డా.దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్)