- అవినీతికి అడ్డాగా ప్రభుత్వ కార్యాలయాలు
- పెచ్చుమీరుతున్న లంచావతారులు
- కాసుల కోసం సామాన్యులను పీడిస్తున్న ఉద్యోగులు
- ఏసీబీ రైడ్లు జరిపినా మారని వక్రబుద్ది
- అధికం అవుతున్న ఏసీబీ ట్రాప్ లు
అధికారులలో పెరిగిన అవినితో లేక ప్రజలలో పెరిగిన చైతన్యమో గాని ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడుతున్న వారి సంఖ్య అధికం అవుతుంది. ఇందుకు అధికారులలో అత్యాశనే కారణంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఇటీవలి కాలంలో అవినీతి నిరోధ కశాఖ అధికారులు లంచం ఎవరైనా అడిగితే తమను సంప్రదించాలని ప్రచారం నిర్వహించటం కూడా ఏసీబీ ట్రాప్ లకు కారణం అవుతుంది. ఓ డీఎస్పీ, సిఐ రూ.16 లక్షలతో పట్టుబడటం పరిశీలిస్తే అవినీతి ఏ స్థాయిలో జరుగుతున్నదో స్పష్టం అవుతుంది. ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు ఎటువంటి డోకా ఉండదు. అధికారులు ఎవరికి వారు స్వయంగా ఆలొచించుకుని అవినీతికి దూరంగా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇటీవల ఎక్సయిజ్ కార్యాయంలో ఏసిబి ట్రాప్ సందర్భంగా పలు చోట్లకు సంబందించిన కార్యాలయాలకు సంబందించిన సమాచారాన్ని ఏసిబి అధికారులు సేకరించినట్లు సమాచారం. విషయం తెలిసిన సదరు ఉద్యోగులు కొంత కాలం పాటు విధులకు గైర్హాజరు అయినట్లు సమాచారం.
అయిన సరే ప్రభుత్వ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులు తమ వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. నిరుపేదలు పనికోసం ప్రభుత్వ కార్యాలయం మెట్లెక్కితే చాలు.. పైసల కోసం పట్టు బడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. చేయి తడపనిదే ఇసుమంత పని కూడా జరగడం లేదు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన సేవలు డబ్బులిచ్చి పొందాల్సిన దుస్థితి పట్టింది. పోలీస్, మున్సిపల్, ఇంజినీర్, రెవెన్యూ, ఆర్టీఏ, మైనింగ్, అటవీ, పిసిబి, హెల్త్ డిపార్ట్ మెంట్ వంటి ప్రధాన శాఖల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. ఏసీబీ రైడ్ లు జరిగినా ఉద్యోగుల్లో కాస్తయినా భయం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే ఎంత మంది ఉద్యోగాలు ఊడుతాయో అర్థం కావడం లేదు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే వారధిగా ఏర్పాటైన ప్రభుత్వ
కార్యాలయాలు అవినీతికి, లంచాలకు అడ్డాలుగా మారిపోయాయి. సాధారణ ప్రజలకు అందాల్సిన అవసరమైన సేవలు ఉచితంగా అందాల్సి ఉండగా డబ్బులిచ్చి పొందాల్సిన దుస్థితి పట్టింది. ప్రభుత్వ శాఖల్లోని అన్ని స్థాయిల్లో వేళ్లూనుకున్న అవినీతి, లంచగొండితనంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కు పాదం మోపుతున్నా ఎక్కడా అవినీతి, లంచ గొండితనం ఆగడం లేదు. కాసులివ్వనిదే ఫైల్ కదలని కార్యాలయాలుగా ముద్రపడ్డ వాటిలోనూ రవ్వంత మార్పు కనిపించడం లేదు. ఏసీబీ రైడ్స్ జరిగిన కొద్ది రోజుల వరకే తులసి వనంలా పవిత్రంగా కనిపించే కార్యాలయాలు మళ్లీ యథావిధిగా లంచాలకు అడ్డాగా రూపాంతరం చెందుతున్నాయి. పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇంజినీర్ శాఖ, రెవెన్యూ శాఖ వంటి ప్రధాన శాఖల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. ఈ విషయం ఏసీబీ దృష్టిలోకూడా ఉండటంతో వాటిపైనే ఆ శాఖ అధికారులు కొద్ది రోజులుగా ఫోకస్ పెట్టారు. ఏసీబీ రైడ్ లు జరిగినా ఉద్యోగుల్లో కాస్తయినా భయం లేని తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గాలి ఉన్నపుడు తూర్పార బట్టుకోవాలి.. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సూక్తులు చెబుతూ మరీ లంచావతారులు బల్లకింది భాగోతాన్ని ఎంచక్కా కొనసాగిస్తున్నారు.
ఓ పక్క ఉన్నతాధికారుల చర్యలు, మరో పక్క ఏసీబీ అధికారులు తనిఖీలు, రెడ్ హ్యాండెడ్ గా పట్టివేతలు వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా ఏ ప్రభుత్వ శాఖలోనూ మార్పు కనిపించడం లేదు. ప్రధాన ప్రభుత్వ శాఖల్లో అవినీతి వేళ్లూనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లంచాల జబ్బు సర్వసాధారణంగా మారిపోయింది.