వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కన్నుమూత.. ప్రముఖల సంతాపం

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే ఈరోజు (మంగళవారం) గుండెపోటు రావడంతో మాజీ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు. 2014 సెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు మదన్ లాల్. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జి‌గా మదన్ లాల్ ఉన్నారు. మదన్ లాల్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు సంతాపం తెలియజేశారు.

ఖమ్మం జిల్లా వైరా మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోత్ మదన్ లాల్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మదన్ లాల్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. మదన్ లాల్ మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.