జూన్ మొదటి వారంలో వన మహోత్సవం: అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

  • సామాజిక ఉద్యమంగా చేపట్టాలి
  • వైఫల్యాలను సమీక్షించుకుని పక్కాగా నిర్వహించాలి
  • అటవీ అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

ఈ ఏడాది వన మహోత్స వం -2025 కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గతానుభవాలు, వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని నాటిన ప్రతి మొక్కను కాపాడుకునేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమం నిర్వహణపై సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్య దర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సి. సువర్ణ, ఎంఏ యూడీ కార్యదర్శి టీకే శ్రీదేవి, అటవీశాఖ ఉన్నతాధికారి ప్రియాంక వర్గీస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు వన మహోత్సవం కింద పకడ్బందీ కార్యచరణ రూపొందించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో…. అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. జిల్లాల్లో జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని, 2024 లో శాఖాపరంగా రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు వేసుకోగా… 19.04 కోట్లు నాటినట్టు మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో ఎదురైన అనుభవాలు, తప్పిదాలు పునరావృత్తం కాకుండా అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించాలని, ప్రజలు అడిగిన మొక్కలను అందజేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇండ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పూల మొక్కలను ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గతం కంటే ఈసారి రుతుపవనాలు ముందే వచ్చాయని, ఈనేపథ్యంలో అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. ఏ ఏరియాలో ఎటువంటి చెట్లు నాటాలో గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మంత్రి కోరారు.

ఈ దఫా వనమహోత్సవంలో ఈత, తాటి, వేప, చింత, కుంకుడు మొక్కలు నాటించాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారికి గుర్తించి ప్రోత్సా హాకాలు ఇవ్వాలని ఆదేశించారు. మొక్కల పెంపకం లో ప్రత్యేకంగా కృషి చేసిన వారికి పలు విధాలుగా గుర్తింపు ఇవ్వాలన్నారు. వనజీవి రామయ్య వంటి మహనీయుల కుటుంబీకులను సన్మానం చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. తొలుత వచ్చే నెల (జూన్ ) మొదటి వారంలో ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పీపీటీనీ మంత్రి కొండా సురేఖ పరిశీలించారు.