మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ రహస్య భేటీ

  • టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్

మాజీ మంత్రి హ రీశ్‌రావు, ఈటల రాజేందర్ శామీర్‌పేటలో రహస్యంగా భేటీ అయ్యారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. కెసిఆర్ ఆదేశాలతో నే హరీశ్‌రావు ఈటలను కలిశారని ఆయన చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణపై మాట్లాడుకున్నారని, అనంతరం వారిద్దరూ కెసిఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారని ఆయన ఆరోపించారు. విచారణలో ఒక్కటే సమాధానం చెప్పాలని ఈ ముగ్గురు డిసైడ్ అయ్యారని ఆయన అన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య రహస్య అవగాహన ఉందని, అందుకు అనుగుణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం కెసిఆర్‌కు ఏటిఎంలా మారిందని, ఆనాడు జేపి నడ్డా ఆరోపించారని, ఈ ఆరోపణలను ఈటల నిజం చేస్తారా? లేక కెసిఆర్‌తో ఉన్న పాత దోస్తీతో అబద్ధాలు చెబుతారా అన్నది త్వరలో తేలుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈటల బిజెపికి చెందిన వ్యక్తా లేక కెసిఆర్ మని షా అన్నది విచారణ రోజు బయటపడుతుందని ఆయన పేర్కొన్నాన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగలు దొంగలు ఊర్లు పం చుకున్నట్లు ఈ ముగ్గురి వ్యవహారం ఉందని మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందునే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, ఇదంతా కెసిఆర్ సూచనలతోనే జరిగిందని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిన నేతలెవరో రాజాసింగ్ చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముందు కవిత, రాజాసింగ్ అడిగే ప్రశ్నలకు కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని పిసిసి అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కవిత వ్యాఖ్యలపై కెసిఆర్, కెటిఆర్, ఎందుకు స్పందించరని, పదేళ్లు దోచుకున్న సొమ్మే బిఆర్‌ఎస్‌లో గొడవలకు దారి తీసిందని ఆయన అన్నారు. ప్రతి పార్టీలో కోవర్టులు ఉంటారని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కులగణన చేయాలంటే దమ్ముండాలని ఆయన తెలిపారు.