సిందూరం మొక్క‌ను నాటిన ప్ర‌ధాని మోదీ

ఇవాళ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని త‌న నివాసంలో సిందూరం మొక్క‌ను నాటారు. గుజ‌రాత్‌లోని కుచ్‌కు చెందిన త‌ల్లులు, సోద‌రీమ‌ణులు ఈ మొక్క‌ను త‌న‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 1971లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధం స‌మ‌యంలో ఆ మ‌హిళ‌లు అసాధార‌ణ సాహ‌సాన్ని, దేశ‌భ‌క్తిని చాటిన‌ట్లు మోదీ తెలిపారు. సోష‌ల్ మీడియా అకౌంట్‌లో మోదీ .. సిందూరం మొక్క నాటిన వీడియోను, ఫోటోల‌ను పోస్టు చేశారు. దేశ మ‌హిళ‌ల ధైర్యానికి, ప్రేర‌ణ‌కు గుర్తుగా సిందూరం మొక్క నిలుస్తుంద‌న్నారు. ఢిల్లీలోని 7 లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌లో ఉన్న నివాసంలో మోదీ ఆ మొక్క‌ను నాటారు.

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా చేప‌ట్టిన మిలిట‌రీ చ‌ర్య‌కు ఆప‌రేష‌న్ సిందూర్ పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. భార‌తీయ మ‌హిళ‌లు సంప్ర‌దాయ రీతిలో త‌మ నుదుటికి సిందూరం పెట్టుకుంటారు. ఇది త‌మ సౌభాగ్యంగా భావిస్తారు. భార‌తీయ సంప్ర‌దాయంలో సింధూరానికి మ‌త‌ప‌ర‌మైన‌, ఆచార‌ప‌ర‌మైన విశిష్ట‌త ఉన్న‌ది. త‌న వీడియో సందేశంలో .. గ్లోబ‌ల్ క్లైమేట్ గురించి కూడా మోదీ ప్ర‌స్తావించారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అన్ని దేశాలు ఆత్మ‌ప‌రిశీలిన చేసుకోవాల‌న్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయ‌డ‌మే ఈ యేటి ప‌ర్యావ‌ర‌ణ నినాదం అని తెలిపారు. గ‌త నాలుగైదు ఏళ్ల నుంచి ఇండియా దీనిపై ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు.