మానవుడు ముందుచూపు కోల్పోయి భూమిని నాశనం చేస్తున్నాడు అంటాడు ఆల్బర్ట్ స్క్విట్జర్. మనిషి దురాశ పర్యావరణ కాలుష్యానికి కారణమౌతోంది. ఈ కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతోంది. భూసారం క్షీణిస్తున్నది, అడవులు కనుమరుగవుతున్నాయి. అభివృద్ధి పేరుతో సాగిస్తున్న జీవనయానం మనిషిని పతనం అంచులకు చేర్చింది. నేడు ప్రపంచ సమస్య టెర్రరిజం కాదు, కాలుష్యం.
వందేళ్ల క్రితం భారత భూభాగంలో 40 శాతంగా వున్న అడవులు క్రమేణా అంతరించి పోతున్నాయన్నది వాస్తవం. ప్రాణాధారమైన చెట్లను సంరక్షించుకోవాలి. ఇలా కలుషితమైపోతున్న ప్రాణవాయువును స్వచ్ఛమైనదిగా మార్చుకోవాలంటే ఇంటింటా చెట్లను నాటాలి. అడవులను సంరక్షించాలి. భూగోళం మీద మనిషితో పాటు దాదాపు 14 లక్షల జీవ జాతులున్నట్లు అంచనా. అంచనాకి రానివి ఎన్ని ఉంటాయో తెలియదు.
ప్రకృతితో మమేకం అవ్వకుండా..
భూగోళం మీద ప్రధానంగా నాలుగు బయోలాజికల్ సిస్టమ్స్ వున్నాయి. ఇవి మనిషి మనుగడకు, జీవికకూ, ప్రధానమైనవి. కానీ దురదృష్టవశాత్తు మనిషి వాటి మీద చేస్తున్న దాడి తీవ్రమైనది. ప్రస్తుతం మనిషి కోర్కెలను భూమి సైతం తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. పర్యావరణాన్ని, ప్రపంచాన్ని, భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనిషి మీదే వుంది. ఆది మానవులు ప్రకృతిని ఎంతో ఆరాధించేవారు. కానీ నేడు ఆధునిక మానవుడు అన్ని తెలిసి ప్రకృతిని హరిస్తూ తన మనుగడకు ముప్పు తెచ్చుకొంటున్నాడు. ఒకప్పుడు భూమిపై 3.4 కోట్ల చదరపు కిలోమీటర్లు అడవులు విస్తరించి ఉండేవి. నేడు వాటి విస్తీర్ణం సగానికి పైగా తగ్గిపోయింది. దేశంలో పర్యావరణ సమతూకానికి 33 శాతం భూభాగంలో అడవులు ఉండాలని 1952-1988 నాటి జాతీయ అటవీ విధానాలు తీర్మానించాయి. ఆ స్ఫూర్తికి తూట్లు పొడవడంతో అడవులు 22 శాతానికి పడిపోయాయి. ప్రభుత్వాలు అటవీ విస్తీర్ణం పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు నెరవేరలేదు. మనిషి ప్రకృతితో మమేకం అవ్వకుండా.. భూగోళంతో సమతుల్యం లేకుండా చేసే అభివృద్ధి ముందుకు సాగదు. విలువైన సహజ వనరులను మానవాళి అవసరాలకు పొదుపుగా వాడుకొని వాటిని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించడం కనీస ధర్మం. ఈ బాధ్యత, ప్రభుత్వాలపై, పౌరసమాజంపై ఎంతో ఉంది.
వాతావరణ దుష్ఫలితాల వలన..
ప్రస్తుతం మన దేశంలోని 14 పెద్ద నదులు, 55 చిన్న నదులు పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలతో కలుషితం అవుతున్నాయి. ఇక రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం వల్ల హానికర వ్యర్థాలు భూగర్భంలోకి చేరిపోతున్నాయి. ప్రపంచంలోని మొదటి పది కాలుష్య నగరాల్లో అధిక భాగం భారత్ లోనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. చెట్లను నరకడం, చెరువులను పూడ్చడం, కొండలను పిండి చెయ్యడం వంటి దుశ్చర్యలతో భూతాపం ప్రమాదకరమైన స్థాయికి చేరింది. దీంతో రుతువులు గతి తప్పాయి. వాతావరణ మార్పులు పర్యవసానంగా భీకర ఎండలకు సముద్ర మట్టాలు పెరిగి ఉప్పెనలు వస్తున్నాయి. కుండ పోత వానలతో వరదలు ముంచెత్తి వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విధ్వంసం ఇలాగే కొనసాగితే మనిషి భవిష్యత్ ప్రశ్నార్ధకమే. ఇటువంటి విష పరిణామాలు మనిషి స్వయంకృతాపరాధాలే…
ప్రకృతిని ఆరాధించడమే ప్రధానం కావాలి..!
ఈ భూమిపై ఉన్న ప్రతి జీవరాశి ప్రకృతికి లోబడి మసలు కోవాలసిందే. పర్యావరణ పరిరక్షణలో నేల తల్లిని కాపాడటంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలి. వికసిత్ భారత్ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణ. ప్రకృతిని ఆరాధించడం ప్రధానం కావాలి. ప్రకృతినే కబళించే విధంగా మనిషి అహేతుక వైఖరి విడనాడాలి. అలాగే ప్రభుత్వాలు సైతం పర్యావరణ చట్టాలపై అవగాహన పెంచాలి. పరహితమే తప్ప తన హితం ఎరుగని ప్రకృతిని మానవుడు దారుణంగా క్షోభ పెట్టడం మానవాళి మనుగడకు మహాపరాధం. కావున ఇకనైనా మనిషి తన పంథా మార్చుకోవాలి. (సోర్స్ : దిశ, నీరుకొండ ప్రసాద్)