బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడిన గోపీనాథ్‌ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్‌, కుమార్తె అక్షరనాగ ఉన్నారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా..

మాగంటి గోపీనాథ్‌ 1963 జూన్‌ 2న హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్‌ నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తిచేశారు.   2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పీ విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్‌ నుంచే పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్‌ తెలంగాణే శ్వాసగా పనిచేసే బీఆర్‌ఎస్‌ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు.