మాగంటి గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్‌ఎస్‌కు తీరని లోటు: కేటీఆర్‌, హరీశ్‌ రావు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్‌ఎస్‌కు తీరని లోటని చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపినాథ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

గత గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడిన గోపీనాథ్‌ను కుటుంబ సభ్యులు ఏఐజీ దవాఖానకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. గత మూడు రోజులుగా వెంటీలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.

గోపీనాథ్‌ అకాల మరణం అత్యంత బాధాకరం: హరీశ్‌ రావు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శమని తెలిపారు. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.