కాలుష్యం ఫుల్.. కార్యాచరణ నిల్..

ప్రజల జీవితాలతో ముడివడిన పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాలకు ఇంకా మొక్కుబడి వ్యవహారంగానే ఉంది. వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్) రూపంలో అంచనాలకు మించిన వేగంతో ప్రమాదం. ముంచుకువస్తున్నా ప్రభుత్వాల్లో కదలికలేదు. ప్రతియేడు తంతులాగే నిన్నటికి నిన్న నిర్వహించిన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవ’ కార్యక్రమాలు, వంతుకు తద్దినం పెట్టినట్టే ఏ ప్రభావం లేకుండా సాదాసీదాగానే ముగిశాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి! ప్రపంచమంతా ఒక దిశలో సాగుతుంటే మన నడక మరోలా ఉంది. ఈ బాధ్యతను ప్రత్యేకంగా భుజాలకెత్తుకున్న ‘నీతి ‘ఆయోగ్’ నిద్రావస్థను వీడట్లేదు. జూన్ 5, పర్యావరణ దినోత్సవం ఈ యేటి ముఖ్యాంశం (థీమ్) గా ఐక్యరాజ్యసమితి (యూఎస్) ప్రకటించిన ‘ప్లాస్టిక్ కాలుష్య సమస్యను అదిగమిద్దాం’ దీనిపట్ల ఎవరికీ పట్టింపూ లేని దురవస్థ. అసలీ విషయంలో కేంద్రం వద్ద ఏ ఆయుధమూ (నిఘా నియంత్రణ చట్టం) లేదు. రాష్ట్రాల్లో ఏ ప్రత్యేక కార్యాచరణా లేదు. అవగాహన పెరగాలని, ప్రజల సహకారం కావాలనే పిలుపు తప్ప చేస్తున్నదేమీ లేదు.

క్లైమేట్ ఎమర్జెన్సీ
బ్రిటన్, ఫ్రాన్స్ తో సహా ఎన్నో ఐరోపా దేశాలు క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించి, ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించాయి. వాతావరణ మార్పుల్ని అడ్డుకోవడం (రెజిలియన్స్), ప్రభావాల్ని తట్టుకోవడం (మిటిగేషన్), వాటికి తగినవిధంగా సర్దుకోవడం (అడాప్టేషన్) అనే మూడు రకాల చర్యలకు ప్రణాళికతో సంసిద్ధమయ్యాయి. నిర్దిష్టమైన పనుల్ని ఇప్పటికే చేపట్టాయి. వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలు, నష్టాలు అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువని, మనవంటి అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాల్లోనే సష్టాలు ఎక్కువని యూఎన్ అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. చుట్టూ మూడు చిక్కుల సముద్రం ఆవహించి ఉన్న భారత ద్వీపకల్పం వంటి దక్షిణాసియా దేశాల్లో నష్టం మరీ అధికంగా ఉండనుందని అంతర్ ప్రభుత్వాల కీలక బృందం (ఐపీసీసీ) నివేదిక హెచ్చరించింది. అసాధారణ వర్షాలు, తుఫాన్ లు, అతి చలి రోజులు, తీవ్రమైన ఎండలు, వేడిగాలులు, సుదీర్ఘ కరవుకాలాలు గడచిన కొన్నేళ్లుగా మన కళ్లకు కడుతున్న వాస్తవాలే!

ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమైన కాలుష్యం, దీన్ని “నియంత్రించాలి. బడులు. కాలేజీల్లో పిల్లలకు అవగాహన పెరగాలి. ప్రజలు సహకరించాలి’ అని రాష్ట్ర అడవులు, పర్యావరణ మంత్రి కొండా సురేఖ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వేదిక నుంచి పిలుపునిచ్చారు. మంచిదే, కానీ అంతకు మించి నిర్దిష్ట కార్యాచరణ ఏమీ లేకుండా సమస్య పరిష్కారం అయ్యేదెలా? పదో తరగతిలో మెరిట్ సాధించిన ఒక జిల్లా విద్యార్థుల్ని ప్రశంసిస్తూ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొక్కలు నాటి. పర్యావరణ ప్రాధాన్యతను వివరించారు. ఓకే సంతోషం. కానీ, ఇది సరిపోదు. ‘అమ్మ’ పేరుతో ప్రతి ఒక్కరు. కనీసం ఒక మొక్క నాటాలి’ అని పిలుపునిస్తూ, తన కార్యాలయ సిబ్బందితో కలిసి ఢిల్లీలోని అధికారిక నివాస ప్రాంగణంలో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ మొక్కలు నాటారు. ఆహ్వానించదగ్గ మంచిపనే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలా అక్కడొకటి, అక్కడొకటీ ఆరా కార్యక్రమాలు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో జరిగాయి. అంతకు మించి ఏమీ లేకుండానే ఆ రోజు అలా గది చిపోయింది. సరిగ్గా 365 రోజులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మళ్లీ వస్తుంది. అప్పుడుకూడా మనం ఇలాగే ఏదో చేస్తాం. ఫొటోలు దిగుతాం. మీడియాలో ప్రకటించుకుంటాం. అంతకు మించి ఏమీ చేయం.

చర్యలేవి..? ఆలోచనేది..?
దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా కుప్పతిప్పలుగా కనిపించే ప్లాస్టిక్ భూతం కోరలు విప్పి స్వాగతం చెబుతుంది. వద్దని పదేపదే చెబుతున్నా.. ఒకేమారు వినియోగించే ప్లాస్టిక్ విచ్చలవిడిగా వాడుతుండటంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఈ రోజు అతి పెద్ద సమస్యగా మారాయి. ఎండకు, వానకు, గాలి ఒరిపిడికి, ఘర్షణకు గురై అవి మైక్రోప్లాస్టిక్స్ గా విడిపోయి విష రసాయనాలుగా మట్టిలో, నీళ్లలో, భూగర్భజలాల్లో కలిసిపోతున్నాయి. ప్రవాహ జలాల ద్వారా చెరువులు, కుంటలు, ఆపైన కాలువలు, నదుల గుండా సముద్రం చేరుతున్నాయి. ప్లాస్టిక్ కాల్చివేసిన (15 శాతం అలా కాల్చేస్తున్నారు) చోట గాలిలో కలిసి వాయుకాలుష్మా నికి కారణమవుతున్నాయి. ఇవి ప్రధానంగా రెండు రకాల సమస్యలకు దారి తీస్తున్నాయి.

1) జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ), పలు రకాల జీవావరణ వ్యవస్థల నాశనానికి కారణమవుతున్నాయి. 2) ప్లాస్టిక్ వ్యర్థాలు. గాలి, నీరు, మృతిక, ఆహారపదార్దాల్ని కాలుష్యం చేయడం ద్వారా మనుషుల, జీవుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. క్యాన్సర్ తో సహా రకరకాల జబ్బులు, వింతవ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రతియేటా సగటున 380 నుంచి 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. 20వ శతాబ్దం మొత్తం పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలతో సమానమైన వ్యర్థాలు గత పదేళ్ల కాలంలోనే పోగయ్యాయి. ప్రస్తుత సరళి కొనసాగితే 2040 నాటికి ఇది రెట్టింపయ్యే ప్రమాదముంది. భూగోళంపై నాలుగింట మూడొంతులు వ్యాపించి ఉన్న సముద్రాల్లోనూ ప్లాస్టిక్ వ్యర్ధాలు నిండిపోతున్నాయి. సమీప భవిష్యత్తులోనే సముద్రజలాల్లో ఉన్న మొత్తం చేపల పరిమాణాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం మించిపోయే ప్రమాదముందనే అంచనాలున్నాయి. సముద్ర జలాలపై ఎండదెబ్బ పెరగటం కూడా భూమిపై వాతావరణ మార్పులకు కారణమవుతోంది. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి వంటి సమస్యలు పెచ్చుమీరి మానవులు, ఇతర జీవరాశిమనుగడను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.

తెలిసీ ఎందుకు విఫలమవుతున్నాం?
సమస్య తీవ్రత తెలుసు, కొద్దో, గొప్పో పరిష్కార మార్గాలూ తెలుసు. అయినా, ఎందుకు ఈ సమస్యను అధిగమించలేకపోతున్నాం? అన్నది కోటిరూకల ప్రశ్న! దీనికీ సమాధానాలున్నాయి. పాలకులు, ప్రభుత్యాల ప్రాధాన్యతల్లో ఇది లేకపోవడం ప్రస్తుత దురదృష్టకర పరిస్థితికి కారణం ఓట్లు రావేమోననే సంకుచిత రాజకీయ ఆలోచనలు కూడా కారణంకావచ్చు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్లాస్టిక్ నియంత్రణపై సమగ్రమైన చట్టం’ లేదు. ఎడతెగని ప్లాస్టిక్ సమస్యకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. 1) సమస్యల్ని వాస్తవిక దృష్టితో గుర్తించని బాధ్యతారహితమైన జీవనశైలి. 2) వాడకాన్ని తగ్గించే ఆలోచన చేయకుండా. మన దగ్గర ఉంచుకోకుండా ప్లాస్టిక్ ను వదిలించుకుంటే (డిస్పోజల్) చాలు, అదే పరిష్కారం అనే ముతక ఆలోచన, 3) ఆశ్చర్యకరంగా ప్లాస్టిక్ (వ్యర్ధాల)ను వివిధ రూపాల్లో దిగుమతి చేసుకోవడం. 4) నిషిద్ధ (20 మైక్రాన్ల లోపు మందపు ఒకసారి వినియోగించే) ప్లాస్టిక్ వినియోగ స్థాయిలో కాకుండా ఉత్పత్తి స్థాయిలోనే అడ్డుకునే ఆలోచన, వ్యవస్థ, నిబంధన, ఆచరణ లేకపోవడం, 5) వాడిన ప్లాస్టిక్ ను పునర్వినియోగయోగ్యం (రీసైకిల్) చేయకపోవడం ప్రస్తుతం 15 శాతమే చేస్తున్నారు) కాలుష్యానికి కారణమవుతోంది. (6) ఇప్పుడున్న రూపాల్లో ప్లాస్టిక్ వస్తువుల్ని వినియోగించకూడదంటే, వాటిస్థానే ప్రత్యామ్నాయాల్ని ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేయకపోవడం, అందుబాటులో ఉంచకపోవడం, 7) అటు కేంద్రం పైనో, ఇటు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలపైనో వదిలి రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం. ఐక్యరాజ్యసమితి పిలుపు ఇచ్చినట్టు ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని అధిగమించే’ కృషిలో వైఫల్యానికి ఇవే ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయాల ప్రోత్సాహమే పరిష్కారం
వాతావరణ కాలుష్యం దృష్ట్యా ప్లాస్టిక్ ప్రమాదకారి. వద్దు అనుకున్నపుడు దానికి బదులు ప్రత్యామ్నాయమే మిటోపాలకులు, ప్రభుత్వాలే చూపించాలి. పౌరులకు వాటిని విరివిగా అందుబాటులోకి తేవాలి. ఆ మేరకు ప్రజల్లో అవగాహన పెంచాలి. అప్పుడు, సహజంగానే ప్రమాదకరమైన ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది. ఉదాహరణకు తిరుపతి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించారు. ఆ మేరకు, అక్కడుండే పరిమిత అవసరాలకు తగినట్టు తాగునీటి కోసం సీసం బాటిల్లో, లడ్డూలు, ప్రసాదాలు, ఇతర పూజాద్రవ్యాల రవాణాకు బట్ట జనుము, నార బస్తాలు అందుబాటులోకి తెచ్చారు. అలా అన్ని చోట్ల ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తే ప్లాస్టిక్ వినియోగం సహజంగానే తగ్గుతుంది. శిలాజ ఇంధనాలకు బదులు పునర్వినియోగ, పునరుత్పాదక ఇంధనాల్ని తీసుకురావడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని పరిమితం చేయవచ్చు. ఎందుకంటే, క్రూడ్ వంటి ముడిచమురు శుద్ధి ప్రక్రియలోనే ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది కనుక మూలంలోనే దాన్ని నియంత్రించినట్టవుతుంది. ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేనేత, జౌళి పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా గణనీయంగా ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయవచ్చు. ప్రభుత్వాల చిత్తశుద్ది, ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం ఈ సమస్య పరిష్కారంలో ఎంతో కీలకం.(సోర్స్: V6 వెలుగు, ఆర్. దిలీప్ రెడ్డి పోలిటికల్ సోషల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ)