తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలను నాటే విధంగా ప్రేరేపించాలి: భద్రాద్రి డీఎఫ్‌వో కృష్ణ గౌడ్

 పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్‌వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మూడేండ్లుగా ప్రతిరోజు మొక్కలు నాటుతూ కృషి చేస్తున్న చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ అభినందించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచన మేరకు గత నలభై ఏళ్లుగా ప్రకృతికి విశేష సేవలు అందిస్తున్న మొక్కల వెంకటయ్య, గత 15 ఏండ్లుగా గింజలు సేకరిస్తూ సీడ్‌మాన్‌గా పేరొందిన హరినాథ్‌, విశ్వామిత్ర చౌహాన్‌ కలిసి వాక్‌ ఫర్‌ ట్రీస్‌ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో అడవుల నుంచి వివిధ వృక్ష జాతికి చెందిన గింజలను సేకరించారు. వాటిని మంగళవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో డీఎఫ్‌వో కృష్ణ గౌడ్‌కు అందజేశారు. వారి సిబ్బందితో అడవిలో చల్లించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్‌ ప్రకృతికి చేస్తున్న సేవలకు గానూ ప్రశంసిస్తూ శాలువతో సన్మానించారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ చిన్నారులు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని, మొక్కల పట్ల అవగాహన కల్పించాలని, విశ్వమిత్ర చౌహాన్‌లా తమ పిల్లలను తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం వన విహార్‌ ఆవరణలో జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

అటవీ శాఖ అధికారికి అందజేసిన విత్తనాల్లో ఇప్ప గింజలు, మామిడి గింజలు, ఇరికి గింజలు, పొగడ గింజలు, రుద్రాక్ష గింజలు, సింధూరం గింజలు, సపోట గింజలు, జీడీమామిడి గింజలు, నేరేడు గింజలు, కుంకుడు గింజలు, చింత గింజలు, మారేడు గింజలు, వేగిసా గింజలు, ఎర్రచందనం గింజలు, బాదం గింజలు, అడవి బాదం గింజలు, మునగ గింజలు, తాని గింజలు, కరక గింజలు, ఈత గింజలు, రేలా గింజలు.. ఇలా దాదాపుగా రెండు లక్షలకు పైగా గింజలు ఉన్నాయి.