కాలుష్య పరిశ్రమలలో కొనసాగుతున్న పీసీబీ కేంద్ర (CPCB) బృందాల తనిఖీలు

  • నీటి శాంపిల్స్, మట్టి శాంపిల్స్ సేకరించిన అధికారుల బృందం
  • పరిశ్రమలలో వారం రోజులు పాటు కొనసాగనున్న తనిఖీలు
  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బాధిత రైతులు, పర్యావరణ వేత్తల ఫిర్యాదులతో తనిఖీలు
  • శ్రీ జయ పరిశ్రమ వెనుక భాగంలో భూమిలో ఊరుతున్న వ్యర్థ జలాల శాంపిల్స్, మట్టి శాంపిల్స్ సేకరించిన అధికారులు
  • పరిశ్రమల లోపల, బయట నీటి శాంపిల్స్, మట్టి శాంపిల్స్ సేకరించిన అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా నెలకొల్పిన కాలుష్య కారక పరిశ్రమలలో పీసీబీ కేంద్ర బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాలుష్య బాధితులతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు పర్యావరణ వేత్తలు సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎంపీ పార్లమెంట్ లో కూడా కాలుష్యంపై ప్రశ్నించడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సెంట్రల్ పిసిబి అధికారులు పూర్ణిమ, రాజకుమార్, ఐఐసిటి అధికారులు ఆనంద్, శ్రీ ప్రియ వేదాంతంల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి మొదటిరోజు దండు మల్కాపురం, ఎల్లగిరి, దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల పరిధిలో ఉన్న రసాయన పరిశ్రమల పరిసరాలలో ఉన్న బోర్లలో నీటి శాంపిల్స్ ను, మట్టి శాంపిల్స్ ను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు వారం రోజులపాటు చౌటుప్పల్ డివిజన్ లోని పలు గ్రామాల్లో ఉన్న పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి, శాంపిల్స్ స్వీకరించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా జల, వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలు మాట్లాడుతూ కాలుష్య కారక పరిశ్రమలపై అనేకమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదని, ఇప్పటివరకు చాలాసార్లు అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ కాలుష్యం మాత్రం తగ్గడం లేదని, పరిశ్రమలలో అనుమతులు ఉన్న వాటినే కాకుండా అనుమతులు లేని ఉత్పత్తులు కూడా చేయడం వల్ల రోజురోజుకు కాలుష్యం పెరుగుతుంది. తప్ప తగ్గడం లేదని, అధికారులు ఎటు వంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని, కనీసం ఇప్పుడైనా పరిశ్రమలను తనిఖీలు చేస్తున్న అధికారుల బృందం వాస్తవ పరిస్థితులను, రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకొని, తమ ప్రాణాలను, ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

రెండో రోజు హేజోలా తదితర రసాయన పరిశ్రమలలో, పరిశ్రమల పరిసరాలలో కూడా బోర్ బావులలో నీటి శాంపిల్స్ ను, మట్టి శాంపిల్స్ ను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ డివిజన్ లోని పలు గ్రామాల్లో ఉన్న పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి, నీటి శాంపిల్స్, మట్టి శాంపిల్స్ స్వీకరించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు.

కాలుష్యాన్ని నియంత్రించక పోతే ఆందోళన చేస్తాం : బాధిత రైతులు
పరిశ్రమల యాజమాన్యాలు విపరీతమైన వాయు, జల కాలుష్యానికి పాల్పడుతూ తమ ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే కాలుష్యాన్ని నియంత్రించకపోతే బాధితులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని బాధిత రైతులు హెచ్చరించారు. పరిశ్రమలు చేయు కాలుష్యాన్ని నియంత్రించాల్సిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం కేవలం పరిశ్రమలకు అనుమతించుటకు మాత్రమే పరిమితమైందని, పరిశ్రమల యాజమాన్యం నిబంధనలు అన్ని ఉల్లంఘిస్తూ కాలుష్యానికి పాల్పడుతున్నప్పటికీ, పరిశ్రమల యాజమాన్యం వారితో కుదిరిన అవగాహన మేరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతినుటలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలు చేయు వాయు, జల కాలుష్యం గురించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించామని, ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమ పనితీరు మార్చుకొని విపరీతమైన కాలుష్యానికి పాల్పడుతున్న పరిశ్రమలను మా గ్రామం నుంచి తరలించే ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఉన్న వాయు కాలుష్యాన్ని గుర్తించుటకు కంటిన్యూఎస్ ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టం ను, బోర్ బావులలో కాలుష్యాన్ని గుర్తించుటకు ఫిజో బోర్వెల్స్ ఏర్పాటు చేయించి త్రైమాసికంగా నీటి నాణ్యతను పరిశీలించుటకు ఏర్పాటు చేయించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను బాధిత రైతులు కోరారు.

3, 4వ రోజు కూడా తనిఖీలు కొనసాగాయి. రావుస్ తదితర రసాయన పరిశ్రమలలో, పరిశ్రమల పరిసరాలలోని బోర్ బావులలో నీటి శాంపిల్స్ ను, వ్యవసాయ భూముల్లో మట్టి శాంపిల్స్ ను తీసుకోవడమే కాకుండా శ్రీ జయ లాబరేటరీస్ పరిశ్రమ వెనుక భాగంలో ఉన్న రైతు వస్పరి లింగయ్య వ్యవసాయభూమిలో ఊరుతున్న వ్యర్థజలాల శాంపిల్స్ ను, మట్టి మట్టి శాంపిల్స్ ను జెసిబి తో త్రవ్వి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ డివిజన్ లోని పలు గ్రామాల్లో ఉన్న పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి, నీటి శాంపిల్స్, మట్టి శాంపిల్స్ సేకరించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.

శ్రీ జయ లాబరేటరీస్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: బాధిత రైతు, వస్పరి లింగయ్య
బోర్ బావులలో నీటిని, భూమిలోని మట్టిని కలుషితం చేస్తూ తమ భూమిలో ఎటువంటి పంటలు పండకుండా చేస్తున్న దండు మల్కాపురం గ్రామం పరిధిలో ఉన్న శ్రీ జయ లాబరేటరీస్ పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు వస్పరి లింగయ్య డిమాండ్ చేశారు. శ్రీ జయ పరిశ్రమ వదిలివేసిన వివిధ రసాయనాలతో తన బోరు బావులలో నీరు కలుషితం కావడమే కాకుండా వ్యవసాయ భూమిలో మట్టి పూర్తిగా కలుషితమైనదని. ఈ నేలలో కనీసం పశుగ్రాసం కూడా పెరగడం లేదన్నారు. పరిశ్రమ కాలుష్యం కారణంగా భూమిలో ఎంత విస్తీర్ణంలో మట్టి కలుషితమైనదో స్వయంగా పరీక్షలు నిర్వహించి భూగర్భ జలాలు ఇంకా కలుషితం చెందకుండా ఉండుట కొరకు వ్యర్థ రసాయనాలతో కూడిన మట్టిని ట్రీట్మెంట్ ప్లాంట్ కు పంపించే ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ జయ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని బాధిత రైతు లింగయ్య డిమాండ్ చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు విపరీతమైన వాయు, జల కాలుష్యానికి పాల్పడుతూ తమ ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే కాలుష్యాన్ని నియంత్రించకపోతే బాధితులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని బాధిత రైతు లింగయ్య హెచ్చరించారు.