తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైతులకు రైతు భరోసా నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు ఎన్నికల ముందు హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో గ్యారెంటీ అమలుకు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం. కాగా ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆదివారం ప్రకటించారు.
సోమవారం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని, తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని చెప్పారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు. వారం రోజుల్లో ‘రైతు భరోసా’, సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు.