- కాలకూట విషాన్ని చిమ్మిన పరిశ్రమలు
- గుట్టుగా రసాయన వ్యర్థాలు పంపింగ్
- రసాయనాల పంపింగ్ జల కాలుష్యం
- పూర్తిగా దెబ్బతిన్న భూసారం
- రైతన్న కడుపుకొడుతున్న పరిశ్రమలు
- పగలు – రాత్రి తేడా లేకుండా ఘాటైన వాసనలు
- సీజ్ చేసిన పద్ధతి మార్చుకొని రసాయన పరిశ్రమలు
- బరితెగించిన పరిశ్రమలను శాశ్వతంగా మూసి వేయాల్సిందే.. బాధితుల డిమాండ్
రసాయన పరిశ్రమలు నిబంధనలను కాలరస్తూ కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి. రసాయన పరిశ్రమల్లో రసాయన చర్యల కారణంగా విడుదలయ్యే రసాయన వ్యర్థాలను శుద్ధి కర్మాగారాల్లోకి తరలించాల్సి ఉండగా పరిశ్రమల సమీపంలోనే డిగ్గింగ్ వేసి వ్యర్థాలను భూగర్భoలోకి పంపింగ్ చేస్తున్నాయి. ఫలితంగా భూ, జల, వాయు కాలుష్యం విచ్చలవిడిగా నమోదవుతుంది. గత కొన్నాళ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిసర ప్రాంత జనజీవనం అనారోగ్య భారిన పడుతుండగా భూసారం పూర్తిగా దెబ్బతిని పంటలు నాశనం అవుతున్నాయి. స్థానికుల నుండి పీసీబీకి వెల్లువలా పిర్యాదులు రాగా గత ఐదు రోజులుగా ఆయా పరిశ్రమల సమీపంలో తవ్వకాలు జరుపగా విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. రసాయన పరిశ్రమలు ఏకంగా భూముల్లో డిగ్గింగ్ చేసి రసాయన వ్యర్థాలు పంపింగ్ చేసినట్లు ఫలితంగా 10 నుండి 20ఫీట్ల లోతు వరకు భూసారం దెబ్బతిని రంగు మరి ఘాటైన వాసనలతో మట్టి పెళ్ళలు బయటపడుతున్నాయి. బరితెగించి కాలకూట విషాన్ని భూమిలోకి చిమ్మిన పరిశ్రమలపై పీసీబీ ఎన్ఫోర్స్మెంట్, పీసీబీ సభ్య కార్యదర్శి స్పందించి ఆయా పరిశ్రమలను సీజ్ చేయడమే కాకుండా శాశ్వతంగా మూసివేయాలని ఇక్కడి ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
హైదరాబాద్ విశ్వనగరంలోని రసాయన పరిశ్రమలు శతాబ్దాలుగా నాళాల్లోకి, మురికి కాలువల్లోకి విడుదల చేసిన రసాయన వ్యర్థాలు కారణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఇప్పటికీ ఫ్లోరైడ్ రక్కసితో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్లు మహానగరం వెలుపల చౌటుప్పల్ సమీపంలో వెలుస్తున్న రసాయన పరిశ్రమలు బరితెగింపుకు దిగుతున్నాయి. ఏకంగా రసాయన వ్యర్థాలను డిగ్గింగ్ పద్ధతి ద్వారా భూమిలోకి పంపింగ్ చేస్తున్నట్లు బయటపడింది. ఆయా రసాయన పరిశ్రమల బరితెగింపు చర్యల కారణంగా చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని చాలా గ్రామాల్లోని పంటపొలాలు పూర్తిగా నమరూపం లేకుండా పోతున్నాయి.. ఎన్ని మందులు కొట్టినా పంట చేతికి రాకపోవడం, పంట ఎదుగుదల లేక ఒక వేళ ఎదిగినా పసుపు పచ్చ రంగులోకి మారి రైతన్నల పాలిట శాపంగా మారుతుంది. అనుమానం వచ్చిన ఇక్కడి ప్రజలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పిర్యాదు చేయగా గత ఐదు రోజులుగా పీసీబీ కేంద్ర బృందాలు జేసీబీలతో రసాయన పరిశ్రమల సమీపంలోని భూముల్లో తవ్వకాలు జరుపుతుండగా భూమి లోపల రసాయన వ్యర్థాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి రసాయన పరిశ్రమల్లో వెలువడే రసాయన వ్యర్థాలు రసాయన శుద్ధి కర్మాగారానికి పంపాల్సి ఉంటుంది. కానీ చౌటుప్పల్ డివిజన్ లో వెలిసిన రసాయన పరిశ్రమలే కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయని పీసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా నెలకొల్పిన రసాయన పరిశ్రమలలో పీసీబీ కేంద్ర బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాలుష్య బాధితులతో పాటు స్థానిక ఎంపీ సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సెంట్రల్ పిసిబి అధికారులు పూర్ణిమ, రాజకుమార్, ఐఐసిటి అధికారులు ఆనంద్, శ్రీ ప్రియ వేదాంతంల ఆధ్వర్యంలో స్థానిక పిసిబి అధికారులతో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి దండు మల్కాపురం, ఎల్లగిరి, దోతిగూడెం, అంతమ్మగూడెం, చౌటుప్పల్, లింగోజిగూడెం, కొయ్యలగూడెం గ్రామాల పరిధిలో ఉన్న పలు రసాయన పరిశ్రమలలో, పరిశ్రమల పరిసరాలలోని బోర్ బావులలో నీటి శాంపిల్స్ ను వ్యవసాయ భూముల్లో మట్టి శాంపిల్స్ ను తీసుకున్నారు. పరిశ్రమల సమీపంలోని వ్యవసాయ భూములలో ఎక్కడ తవ్విన రసాయన వ్యర్ధాలు ఊరుతుండడంతో రైతులు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ జయ లాబరేటరీస్ వెనుక భాగంలో రైతు వస్సరి లింగయ్య వ్యవసాయ భూమి వెనుక భాగంలో జెసిపితో తోవ్వి చూడగా రసాయన వ్యర్ధాలు ఊరుతూ కనిపించాయి. అంతే కాకుండా ఆఫ్టమస్, కెమిక్ పరిశ్రమల సమీపంలోని గుమ్మి నరేందర్ రెడ్డి వ్యవసాయ భూమిలో గతంలో తొవ్విన చోటనే మళ్ళీ హిటాచి సహకారంతో తవ్వి చూడగా భూమిలో నుండి పెద్ద ఎత్తున రసాయన వ్యర్ధాలు ఊరుతూ కనిపించాయి. ఈ సందర్భంగా బాధిత రైతులు లింగయ్య, నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తమ ఫిర్యాదుల మేరకు కాలుష్య పరిశ్రమలను తాత్కాలికంగా సీజ్ చేసినప్పటికీ పద్దతి మార్చుకోకుండా అధికారులతో చేసుకున్న అవగాహన మేరకు మళ్ళీ ప్రారంభించి జల, వాయువు కాలుష్యాలను, రసాయన వ్యర్థాలను విడుదల చేస్తూ తమ భూములను, నీటిని, పంటలను, తమ ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకొని కాలుష్యాన్ని నియంత్రించాలని, లేదంటే కాలుష్య కారక పరిశ్రమలను శాశ్వతంగా మూసివేయాలని, అలా కుదరకపోతే ఇక్కడ నుండి తరలించాలని డిమాండ్ చేశారు. (సోర్స్: ఆంధ్రప్రభ)