ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులు

    • ములుగు డీఈఓ జి.పాణి, జూనియర్ అసిస్టెంట్ దిలిప్…
    • బుధేర పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి పట్టివేత

    తెలంగాణ రాష్ట్రంలో ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను పట్టుకున్నారు. ములుగు డీఈఓ జి.పాణి రూ.15 వేలు, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ దిలిప్ రూ.ఐదు వేలు, అలాగే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర పంచాయతీ కార్యదర్శి (జీఆర్-3) పట్లోళ్ల నాగలక్ష్మి ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు ప్రకారం… కన్నాయిగూడెం మండలం ఓ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తయి తిరిగి తన పోస్టింగ్ కోసం డీఈఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. బాధిత ఉపాధ్యాయుడు ఫైల్ కదలడానికి, రూ.20 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తేనే రీ పోస్టింగ్ ఇస్తానని షరతు విధించారు. ఆర్డర్ ను తయారు చేసినందుకు జూనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ.ఐదు వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 2024 అక్టోబర్ నుండి ఉపాధ్యాయుడు ఈ ఏడాది వేసవిసెలవుల వరకూ డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఈ నెల 12న కార్యాలయానికి వస్తే లంచం డిమాండ్ చేయడంతో డబ్బులు ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టంలేక వరంగల్ లో ఉన్న ఏసీబీ అధికారులను ఉపాధ్యాయుడు ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారుల సూచన మేరకు డీఈఓకు రూ.15 వేలు, జూనియర్అసిస్టెంట్ దిలీప్ కు రూ.ఐదు వేలు ఆ ఉపాధ్యాయుడు ఇచ్చారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి వారిద్దరిని పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేయగా ఫిబ్రవరిలో తయారు చేసిన ఆర్డర్ ను ఉపాధ్యాయుడికి ఇవ్వలేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. పట్టుబడిన డీఈఓ, జూనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకుని, నగదు సీజ్ చేసి, ఇద్దరిని మంగళవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

    సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ పట్టుబడింది. మునిపల్లి మండలం బుధేర పంచాయతీ కార్యదర్శి (జీఆర్-3) నాగలక్ష్మి వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ను ఏర్పాటు చేయడానికి, ఓపెన్ ప్లాటక్ కు ఇంటి నంబరు కేటాయించడానికి ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం డబ్బులు నాగలక్ష్మి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఆమెను నాంపల్లి ఏసీబీ కోర్టు రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు.