సూర్యాపేట జిల్లా యార్కారం మాజీ సర్పంచ్‌ ఒంటెద్దు వెంకన్న దారుణహత్య..

సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామ మాజీ సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు రాళ్లతో బాది దారుణంగా హత్య చేశారు. సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వెంకన్నను ఒంటరిగా దొరకబుచ్చుకున్న ప్రత్యర్థులు గ్రామ శివారులోని ఓ ఇంట్లో ఘోరంగా చంపేశారు. కాగా, సర్పంచ్‌ ఎన్నికలప్పటి నుంచే ఆ గ్రామంలో రాజకీయ కక్షలు చెలరేగాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోకుండా పోలీసులు గ్రామాన్ని పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డీఎస్పీ నాగేశ్వర్‌రావు హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి తెలుసుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.