ఇద్దరు అధికారులకు జైలు !

  • ఐఏఎస్‌ అరవింద్‌కుమార్‌, మరో అధికారి ప్రసూనాంబకు 2 వారాలపాటు జైలు శిక్ష
  • కోర్టు ధికరణ కేసులో హైకోర్టు తీర్పు

మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్‌ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్‌ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని ఐఏఎస్‌ అధికారితోపాటు మరో అధికారికి హైకోర్టు జైలు శిక్షను విధించింది. సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కోల్పోయిన యజమానికి 2016లో కేటాయించిన 666.67 చదరపు గజాల ప్లాటును రిజిస్ట్రేషన్‌ చేస్తామని పలుమార్లు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్న కోర్టు ధికరణ పిటిషన్‌లో ఈ ఉత్తర్వులను జారీచేసింది.

గత మధ్యంతర ఉత్తర్వులను మూడు నెలల్లో యజమానికి ప్లాటును రిజిస్ట్రేషన్‌ చేసివ్వకపోతే ప్రతివాదులైన మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా గతంలో చేసిన అరవింద్‌ కుమార్‌, భూసేకరణ అధికారిగా చేసిన మరో అధికారి ప్రసూనాంబకు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో వారం పాటు అదనంగా జైలు జీవితాన్ని గడపాలని షరతు విధించింది. ఈ మేరకు జస్టిస్‌ సీవీ భాసర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. మూసీ నది సుందరీకరణ కోసం భూసేకరణ జరిపినప్పడు ఉప్పల్‌ భగాయత్‌లో ఎస్‌ రాంరెడ్డి భూమిని కోల్పోయారు. ఆయనకు కేటాయించిన ప్లాటు రిజిస్టర్‌ చేయించాలని గత ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. వాదనలనంతరం తాజా తీర్పునిచ్చింది.