లంచావతారుల్లో గుబులు..

  • వణుకుతున్న అవినీతి ప్రభుత్వ అధికారులు
  • ఏసీబీ అధికారుల వద్ద అవినీతి తిమింగలాల చిట్టా..
  • అదును చూసి పంజా విసురుతున్నఏసీబీ
  • ఇప్పటికే దొరికిపోయిన పలువురు లంచగొండ్లు..
  • తాజాగా విద్యుత్ శాఖ జిల్లా అధికారిపై వల
  • రూ.80వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఈ

అవినీతి అధికారుల కరెన్సీ దాహానికి అంతులేకుండా పోతుంది. అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అక్రమార్కుల సంచారం అధికం అవుతుంది. తెలంగాణలో ప్రతీ ప్రభుత్వ ప్రాంగణంలోనూ లంచావతారాల దుర్వాసనకు ముక్కు పుటాలు అదురుతున్నాయి. దీన్ని పసిగడుతున్నఅవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB) అదును చూసి పంజా విసురుతున్నారు. పక్కాగా వల పన్ని నిందితులను పట్టుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ విద్యుత్ శాఖ జిల్లా అధికారిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. బుధవారం ఉదయం సూపరింటెండెంట్ ఇంజనీర్ జె. నరేష్ తన ఇంట్లో క్లాస్వన్ కాంట్రాక్టర్ల నుండి రూ. 80వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

రూ. 1లక్ష డిమాండ్.. చిన్న గూడూరు మండలం, జయ్యారం గ్రామానికి చెందిన ఓ క్లాస్వన్ కాంట్రాక్టరు మరిపెడ, కురవి మండలాల పరిధిలోని విద్యుత్ లైన్ నిర్వాహణకు సంబంధించిన టెండర్ ను గతంలో పొందాడు. అయితే ఆ టెండర్ కు మించి ఆయన అధనంగా చేసిన పనికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని ఏఈ, డీఈ ఆమోదించి ఆ ఫైల్ ను ఎస్ఈకి ఫార్వడ్ చేశారు. దీంతో బిల్లు మంజూరుకు సిఫారసు చేస్తూ తన సంతకం పెట్టాలంటే రూ. 1లక్ష లంచంగా ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ ను ఎస్ఈ డిమాండ్ చేశాడు. గత్యంతరం లేక ఈనెల 14వ తేదీన ఎస్ఈకి రూ.20 వేలు అడ్వాన్ గా ముట్టజెప్పాడు. అనంతరం అవినీతి నిరోదక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించి విషయం వివరించాడు. బుధవారం ఉదయం మిగిలిన రూ.80వేలు ఇస్తూ ప్రణాళికాబద్ధంగా ఏసీబీకి అప్పగించాడు.

కేసులవుతున్నా మారని తీరు.. ప్రజలకు జవాబుదారితనంతో సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖల్లోని అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయించి భారీ మొత్తాలలో ముడుపులు అందుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవైపు ఏసీబీ అధికారులు అవినీతి బ్రాండ్ అంబాసిడర్ భరతం పడుతున్నా, కొంతమంది అవినీతి అధికారులు జంకు బొంకు లేకుండా పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులకు కల్పించిన అవకాశాలను అడ్డగోలుగా వాడుకుంటూ ప్రజలను జలగల్లా పీక్కు తింటున్నారు. తెలంగాణలో అక్రమార్జనాధికారుల సంఖ్య గణనీయంగా ఉందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ప్రతీ కార్యాయలంలో అవినీతి పేట్రేగి పోతుంది.

– అన్ని శాఖల్లోనూ అవినీతి జాఢ్యం.. తెలంగాణ వ్యాప్తంగా కిందిస్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే ఏసీబీ అధికారుల వలలో చిక్కుతుండటం సంచలనం సృష్టిస్తుంది. పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆడిట్, రవాణా, గిరిజన శాఖ, సివిల్ సప్లయీస్ శాఖ, అటవీశాఖ, పిసిబి, ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ శాఖలో కొంతమంది దళారులు ఉండి ప్రతీ పనికి ఓ రేటును ఫిక్స్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండే మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రూ.19,200 లంచం తీసుకుంటుండగా ఆమె కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. గత ఏడాది మే నెలలో మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. మధ్యాహ్నం నుంచి కార్యాలయాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఏజెంట్లు భారీ సంఖ్యలో కరెన్సీ, కాగితాలతో కార్యాలయం లోపల ఉన్నారు. వారందరినీ విచారించారు. ప్రధాన అధికారి వాహన డ్రైవర్ వద్ద, సిబ్బంది వద్ద పరిమితికి మించి నగదును గుర్తించారు.

– 2018లో సబ్ ఇన్స్పెక్టర్.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కమలాకర్ 2018లో ఒకరి భూమి సెటిల్మెంట్ విషయంలో పట్టణ కేంద్రానికి చెందిన వారి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఆ పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు రూ.14వేలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తరువాత ఇదే తొలి కేసు కావడం గమనార్హం.

– వ్యవసాయ శాఖలో..మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో 2019లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు అధికారులపై వేటు పడింది. మరో ఇద్దరిని బదిలీ చేశారు. రైతులకు సాయం చేయాల్సిన అంశాలలో డబ్బులు డిమాండ్ చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అదే సంవత్సరంలో నర్సింహుల పేట ఎంపీడీవో రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

-పరిశ్రమల శాఖలో.. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వీరేశం సైతం 2017వ సంవత్సరంలో ఏసీబీకి చిక్కారు. ఓ గిరిజన వ్యక్తికి సబ్సిడీ మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు.

ఆడిట్ కార్యాలయంలో.. జిల్లా ఆడిట్ కార్యాలయంలో 2022 నవంబరు నెలలో ఓ కానిస్టేబుల్ ఫైల్ క్లియర్ చేయడానికి సదరు కార్యాయలం అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 2001వ సంవత్సరంలో జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రూ. 2లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.