యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మిషన్ పరివర్తన్ యాంటీ డ్రగ్ వారోత్సవాల్లో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం అన్నారు. యోగా చేయడం ద్వారా మనస్సు, శరీరాన్ని ఏకదాటిపై తీసుకు రావచ్చన్నారు.
ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో యోగా, ధ్యానం అనేది చాలా అవసరం అన్నారు. 24 గంటలు విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతాయని, అలాంటపుడు మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు యోగా, ధ్యానం చేయడం ద్వారా ఆందోళన, ఒత్తిడి తగ్గి శరీరంలో నూతన ఉత్తేజం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.