రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 557 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ : మంత్రి తుమ్మల

ఈ రోజు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల , మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరుఖ్ నగర్ మండలాలలోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32000 ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగింది. మంచాల మండలం బోడకొండ గ్రామంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తలకొండపల్లి మండలం చీపునూతల గ్రామంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల మండలం, దేవుని ఎర్రవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు వ్యవసాయశాఖ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు 12000 మాత్రమే ఉందని, కాని తమ ప్రభుత్వ కృషి వలన ఇప్పుడు వాటి ధర రూ. 18748 గా ఉందని మంత్రి వర్యులు అన్నారు. రైతులు సాంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంట ఐన ఆయిల్ పామ్ సాగు వైపు చూడాలని, ఒకసారి ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే దాదాపు 30 సంవత్సరాల వరకు ఆదాయం వస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఆయిల పామ్ పంటలకు డ్రిప్ పరికరాలు సబ్సిడిపై అందచేయాలన్నారు. MIDH పథకం కింద ప్యాక్ హౌస్ కి సబ్సిడి అందజేయాలని, సబ్సిడిపై డ్రోన్లను ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా గుడి మల్కాపూర్ పూల, కూరగాయల మార్కెట్ ని.. అజిజ్ నగర్ కు మార్చాలని కోరారు. మంత్రి స్పందిస్తూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తానికి ఎలాంటి షరతులు లేకుండా డ్రిప్ పరికరాలను సబ్సిడిపై అందచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యానవన పంటలకు, పామ్ ఆయిల్ పంటలో వేసే అంతర పంటలకు కూడా సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇస్తామని అన్నారు. పాలు, కూరగాయల కోసం మన రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఉండే విధంగా మన రాష్ట్రంలోనే కూరగాయల సాగు, డైరీ లను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుకోసం రైతులు కూడా సాంప్రదాయ పంటలనే కాకుండా ఉద్యానవన పంటలు, కూరగాయలు, డైరీలు ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలో వచ్చే నెలాఖరు వరకు 5 వేల ఏకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు  పాల్గొన్నారు